హన్మకొండ కల్చరల్: జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమిని ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయం నుంచి భక్తులు పుట్టల్లో పాలుపోయడం, పసుపు, కుంకుమలు, చలిమిడి, ఆవుపాలు, పచ్చిగుడ్డు, నువ్వులబెల్లం (చిమ్మిరి) మొదలైనవి నైవేద్యంగా సమర్పించారు. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోరికలు నెరవేరాలని మొక్కులు చెల్లించుకున్నారు. కోరికలు తీరిన వారు నాగులమ్మకు చీర, రవిక బట్టలు, వెండి, బంగారంతో చేసిన నాగపడిగలను సమర్పించారు. హనుమకొండ వేయిస్తంభాల ఆలయం, ‘కుడా’ కార్యాలయం రోడ్డులోని శివాలయం, ఎక్సైజ్ కాలనీలోని నాగ ఆభయాంజనేయ సహిత లక్ష్మీగణపతి దేవాలయంలోనూ, హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో పూజలు చేశారు.


