కాశిబుగ్గ: స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఆయుష్ విద్యార్థులు, హౌస్‌సర్జన్లు వరంగల్ ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల వద్ద సోమవారం రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలంగాణ ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు 14వ రోజుకు చేరాయి. దీక్షలో జేఏసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రోహిత్ బాస్రే, డాక్టర్ గణేశ్, డాక్టర్ సంఘమేశ్వర్‌రెడ్డి, డాక్టర్ కీర్తన, డాక్టర్ అంకిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల కోసం తాము శాంతియుతంగా పోరాటం చేస్తూ, అధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. పోస్టర్ కార్డు క్యాంపెయిన్, హైదరాబాద్‌లో ధర్నా చేసినా ఫలితం లేదని వాపోయారు. ప్రభుత్వం కనీసం తమ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాకు విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి తమ గోడును విన్నవించుకోవడానికి అవకాశం కల్పించకపోవడం మరింత బాధకు గురిచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చేవరకు పోరాడుతామన్నారు.


