● రోడ్డు ప్రమాదంలో
యువ క్రికెటర్ దుర్మరణం
● టీజీ –20లో చోటు..
● విషాదంలో వరంగల్ క్రీడాభిమానులు
వరంగల్ స్పోర్ట్స్/ఖిలా వరంగల్: మైదానంలో పరుగులు తీస్తూ.. బంతిని బౌండరీ దాటిస్తూ.. ఒక రోజు జాతీయ జట్టు తరఫున తన కుమారుడు ఆడాలన్నది ఆ యువ క్రికెటర్ తండ్రి కల. తన తండ్రి కలను నెరవేర్చాలని ఆ కుమారుడి తపన మధ్యలో ఆగిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. అటు తండ్రి కన్న కల, ఆ యువ క్రికెటర్ ఆశయం నెరవేరకుండానే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్ను మూశాడు. ఈఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రిడాకారులను విషాదంలో ముంచెత్తాడు. వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన విశ్వనాధ ఓం ప్రకాశ్, కవిత దంపతులు కుమారుడు వైష్ణవ్(21)కు చిన్ననాటి ఉంచే క్రికెట్‌పై ఆసక్తి ఉండేది. తన కుమారుడిని జాతీయ స్థాయి క్రికెటర్‌గా చూడాలన్న ఆశతో హైదరా బాద్‌లోని ఓ క్రికెట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇప్పించారు. మూడు నెలల క్రితం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తెలంగాణ–20 పోటీల్లో వరంగల్ వారియర్స్ జట్టులో ప్రాతి నిధ్యం వహించాడు. ఈ క్రమంలో జూలై 26వ తేదీన రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్ప ల్ స్టేడియానికి నడుచుకుంటూ వెళ్తున్న వైష్ణవ్‌ను వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన వైష్ణవ్‌ను సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. సుమారు 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు. కాగా, విశ్వనాథ్ వైష్ణవ్ వరంగల్ జట్టు నుంచి అండర్–14, 16, 19 విభాగాలతోపాటు వరంగల్–2, 3డే టీములకు ప్రాతినిధ్యం వహించాడు. వేసవిలో జరిగిన శ్రీలంక టూర్లో వరంగల్ జిల్లా నుంచి పాల్గొన్నాడు.
కన్నీటి వీడ్కోలు..
నిన్నటి వరకు క్రికెట్ మైదానంలో పరుగులు తీసిన యువకుడు, నేడు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. క్రికెట్ అభిమానులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో యువ క్రికెటర్ వైష్ణవ్ మృతదేహాన్ని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మేనల్లుడు యువ నేత విష్ణువర్ధన్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. సాయంత్రం స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.


