దుగ్గొండి: వర్షాలు మొహం చాటేశాయి. మిరప నారు ముదిరిపోతోంది. అదను దాటితే పంట పండదు. దీంతో డ్రిప్పు ఉన్న రైతులు మొదట డ్రిప్పు పైపులు పరిచి రెండు మూడు రోజులు నీరు వదిలి పదును కాగానే డ్రిప్పు పైపుల వెంట మిరప మొక్కలు నాటుతున్నారు. ఆదివారం మండలంలోని స్వామిరావుపల్లి గ్రామానికి చెందిన యువరైతు దాసరి రాజు ఇలా డ్రిప్పు ద్వారా నీరు పెట్టి కూలీలతో మిరప మొక్కలు నాటిస్తున్న దృశ్యం సాక్షి కెమెరాకు చిక్కింది.
జపాన్ విద్యాబోధన పరిశీలనకు ఎంపిక
నర్సంపేట: రాష్ట్ర ప్రభుత్వం తరఫున జపాన్‌లోని విద్యావిధానం, బోధన పరిస్థితులు, వినూత్న విద్య అనుభవాలను తెలుసుకునేందుకు ఖానాపురం మండలకేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు బొమ్మెర కుమారస్వామిని ఎంపికచేశారు. జపాన్ పర్యటన సెప్టెంబర్ 5నుంచి 12 వరకు కొనసాగనుంది. ఈ ప్రతిష్టాత్మక విద్య ప్రేరణ కోసం తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని కుమారస్వామి తెలిపారు.
నేటినుంచి మండలస్థాయిలో ప్రజావాణి
న్యూశాయంపేట: ప్రతీ సోమవారం జిల్లాస్థాయిలో కలెక్టరేట్, డివిజన్ స్థాయి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణితో పాటు నేటినుంచి మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిధిలో జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రెవెన్యూ డివిజన్ అధికారులు, మండలస్థాయిలో మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై వినతులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాశిబుగ్గ: ఈ నెల 14న ఎంజీఎంలో ‘పనిచేయని ఎక్స్‌రే మిషన్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సంబంధిత టెక్నీషియన్లను పిలిపించి మరమ్మతు చేయించడంతో ఎక్స్‌రే మిషన్లు పని చేస్తున్నాయి. మొత్తం మూడు ఎక్స్‌రే మిషన్లు పనిచేస్తుండడంతో పేషెంట్ల నిరీక్షణ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పేషెంట్లకు ఎక్స్‌రేలు తీసేటప్పుడు సంబంధిత అధికారులు రేడియాలజీ విభాగంలో అందుబాటులో ఉండట్లేదన్న ఆరోపణలున్నాయి. చాలావరకు ఎక్స్‌రేలను స్టూడెంట్ టెక్నీషియన్లు తీస్తున్నట్లు సమాచారం. జిల్లా అధికారులు తరచూ సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పెట్టుబడిదారుల చేతుల్లో విద్యావ్యవస్థ
నయీంనగర్: దేశంలో, రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఆదివారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో డెమొక్రటిక్ టీచర్స్ అసోసియేషన్ (డాటా) ఆధ్వర్యంలో ‘తెలంగాణ విద్యా వ్యవస్థ, వరంగల్ డిక్లరేషన్–ప్రజా ఎజెండా’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డాటా రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.మోహినొద్దీన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రకుమార్ హాజరై మాట్లాడుతూ.. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల మధ్య ర్యాంకుల కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో అది తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షల్లో 15 సార్లు పేపర్లు లీక్ అయ్యిందని, దళిత, బహుజన, పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అతిథులు ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ (విద్యా పరిరక్షణ కమిటీ), ప్రొఫెసర్ ఎ.హరిప్రసాద్ (కేయూ), ప్రొఫెసర్ కేవై.రత్నం (హెచ్‌సీయూ) ప్రొఫెసర్ ఎం.వెంకటదాసు (ఓయూ), నాగేశ్వర్‌రావు ప్రసంగించారు. సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్, డీఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు, డి.పాపారావు సీనియర్ జర్నలిస్ట్ బండారి లక్ష్మయ్య, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు ఉదయ్‌సింగ్, సాయిని నరేందర్, సురేందర్, సరోజన, సురేశ్, మల్లేశ్, డాటా సభ్యులు నర్సయ్య, భాస్కర్, స్వామిదాసు పాల్గొన్నారు.


