కాశిబుగ్గ: ఎంజీఎంలో ‘పనిచేయని ఎక్స్‌రే మిషన్లు’ శీ ర్షికన ఈ నెల 14న ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సంబంధిత టెక్నీషియన్లను పిలిపించి మరమ్మతు చేయించడంతో ఎక్స్‌రే మిషన్లు ఆదివారం నుంచి పని చేస్తున్నాయి. మొత్తం మూడు ఎక్స్‌రే మిషన్లు పనిచేస్తుండడంతో పేషెంట్ల నిరీక్షణ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. కాగా, పేషెంట్లకు ఎక్స్‌రేలు తీసేటప్పుడు సంబంధిత అధికారులు రేడియాలజీ విభాగంలో అందుబాటులో ఉండట్లేదన్న ఆరోపణలున్నాయి. చాలావరకు ఎక్స్‌రేలను స్టూడెంట్ టెక్నీషియన్లు తీస్తున్నట్లు సమాచారం. జిల్లా అధికారులు తరచూ సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాశిబుగ్గ: సమాన హక్కు, సమాన గౌరవం, సమాన స్థాయిలో స్టైఫండ్ పెంపు కోసం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవదిక దీక్షలు ఆదివారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వద్ద ఆయుష్ విద్యార్థులు తమ డిమాండ్ల కోసం నినాదాలు చేస్తూ ఉదయం నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే నేడు (సోమవారం) నుంచి రిలే నిరాహార దీక్షను ప్రారంభిస్తామని ఆయుష్ జేఏసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రోహిత్ బాస్రె పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు రాజేశ్, సంగమేశ్వర్, సంగీత, ప్రణీత, స్నేహబిందు పాల్గొన్నారు.
హసన్‌పర్తి: సాహితీ రంగంలో విశేష కృషి చేస్తున్న గుంటూరుకు చెందిన లంకా సూర్యనారాయణకు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ, గుంటూరు ఆధ్వర్యంలో భీమారంలోని రాధిక నర్సింగ్ హోంలో జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా లంకా సూర్యనారాయణను నగరానికి చెందిన సాహితీవేత్తలు ప్రొఫెసర్ రామా చంద్రమౌళి, డాక్టర్ లంకా శివరామప్రసాద్, డాక్టర్ గన్నమరాజు గిరిరాజామనోహర్ బాబు, అంపశయ్య నవీన్, శ్రీలేఖ అభినందించారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సాహిత్య రంగంలో 1.48 లక్షల పుస్తకాలతో గుంటూరులో అన్నమయ్య గ్రంథా లయం స్థాపించి సాహితీ రంగానికి సూర్యనా రాయణ అందిస్తున్న సేవలను కొనియాడారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫై నాన్స్ కమిటీ సమావేశం నేడు (సోమవారం) హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో నిర్వహించనున్నారు. కేయూలో 24వ కాన్వొకేషన్‌ను ఈఏడాది నవంబర్‌లో నిర్వహించాలని వర్సిటీ అధికారులు తాజాగా నిర్ణయించారు. గోల్డ్‌మెడల్స్‌కు, తదితర నిర్వహణ ఖర్చుల నిమిత్తం నిధుల వినియోగానికి ఫైనాన్స్ కమిటీ అప్రూవల్ కోసం ఎజెండాలో పెట్టారు. అదేవిధంగా వర్సిటీ పరిధిలో వివిధ పనులకు ఎంతెంత వెచ్చించనున్నారో ఇందులో చర్చించనున్నారు. ఫైనాన్స్ కమిటీ సమావేశం ఆమోదం పొందాక ఈనెల 18న కేయూలో జరిగే పాలకమండలి సమావేశంలోనూ ఆమోదం లభించాల్సి ఉంటుంది. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, ఫైనాన్స్ కమిటీ సభ్యులు కేయూ ప్రొఫెసర్ సురేశ్‌లాల్, డాక్టర్ కె.అనితారెడ్డి నేటి సమావేశంలో పాల్గొంటారు.


