విద్యారణ్యపురి: హనుమకొండలోని పీఆర్‌రెడ్డి భవన్‌లో సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఒద్దిరాజు సోదరుల స్మృత్యర్థం కవి బిల్లా మహేందర్ రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ ఉత్తమ కవితా సంపుటిని సాహితీ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి చేతుల మీదుగా బిల్లా మహేందర్‌కు రూ.10 వేల నగదు పురస్కారం అందించి సత్కరించారు. బాధ్యులు గండ్ర లక్ష్మణ్‌రావు, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య పుస్తకాన్ని సమీక్షించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. తాను మంచి పాఠకురాలినని, ప్రజలకు మేలు చేసే కవిత్వం బిల్లా మహేందర్ రాస్తున్నారని అభినందించారు. కాగా, ఇదే కార్యక్రమంలో మైక్రో ఆర్టిస్టు మట్టెవాడ అజయ్‌ని నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని సహృదయ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్‌వీఎన్ చారి నిర్వహించగా, సంస్థ అధ్యక్షుడు గిరిజా మనోహర్‌బాబు అధ్యక్షత వహించారు. సహృదయ సాంస్కృతిక సంస్థ బాధ్యులు, కవులు పొట్లపెల్లి ఒద్దిరాజు, రఘురావు, ఏవీ నర్సింహారావు, లక్ష్మణ్‌రావు, సీత వెంకట్, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.


