ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026
7
సీఎం దూరదృష్టితోనే అన్నిరంగాల్లో జిల్లా ప్రగతి
● 80వ స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్ర అటవీ,పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
● ఖుష్‌మహల్ మైదానంలో జాతీయ పతాకం ఆవిష్కరణ
ఖిలా వరంగల్: జిల్లా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం దూరదృష్టితో జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ఆమె పేర్కొన్నారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్‌మహల్ మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రత్యేక వాహనంపై పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. జిల్లాలో సాధారణంగా 1,39,997 ఎకరాల్లో వరి సాగవుతుండగా.. ఈ ఏడాది తక్కువ వర్షపాతంతో 51,045 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయని తెలిపారు. మరో 44,745 ఎకరాల్లో మొక్కజొన్న, పెసర తదితర ఆరుతడి పంటల సాగవుతున్నాయని పేర్కొన్నారు. రైతుబీమా కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 242 మంది రైతుల కుటుంబాలకు రూ.12.10 కోట్ల ఆర్థిక సాయం అందించామని వివరించారు. 20,925 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని తెలిపారు.
1,40,862 కుటుంబాలకు గృహజ్యోతి..
గృహజ్యోతి పథకం కింద 1,40,862 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.128.82 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 9,522 ఇళ్లు మంజూరు కాగా, 2,973 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. బ్యాంకు లింకేజీ ద్వారా 2,114 మహిళా సంఘాలకు రూ.148.80 కోట్ల రుణాలు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. 34,964 మంది విద్యార్థుల యూనిఫాం తయారీ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. వరంగల్‌లో రూ.1,371 కోట్లతో 2,100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం 90 శాతం పూర్తయ్యిందని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద జిల్లాలో రూ.56.06 కోట్ల వ్యయంతో 10,565 మందికి వైద్యం అందించామన్నారు.
18,969 మంది విద్యార్థులకు అల్పాహారం..
295 పాఠశాల్లో 18,969 మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. 458 ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ.10.45 కోట్లతో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. మూడు యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ.1.36 కోట్లు మంజూరు చేశామని, 1,594 మంది విద్యా
ర్థులకు మధ్యాహ్నం భోజనం, ఉదయం అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 818 మంది మైనారిటీ విద్యార్థులకు రూ. 94.18 లక్షలు చెల్లించామని, ఇందిరా మహిళా శక్తి కుట్టుమిషన్ల పథకం కింద 498 కుట్లు మిషన్లను అందించామని తెలిపారు.
టెక్స్‌టైల్ పార్కుకు 1,357 ఎకరాల భూమి..
గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని టెక్స్‌టైల్ పార్కుకు 1,357 ఎకరాల భూమిని సేకరించామని మంత్రి వివరించారు. 866 మంది రైతులకు రూ.145 కోట్ల పరిహారం చెల్లించామని, భూములు ఇచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని, ఈప్రాంత ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించామని స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే విస్తరణ కోసం 253 ఎకరాల భూమిని సేకరించి 330 మంది రైతులకు రూ.258 కోట్ల పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు. వరంగల్ బస్‌స్టేషన్ పనులు కొనసాగుతున్నాయని, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.94.10 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదం పొందాయని చెప్పారు. వనమహోత్సవంలో భాగంగా 25.51 లక్షల మొక్కలు నాటే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 11.50 లక్షల మొక్కలు నాటినట్లు మంత్రి తెలిపారు. పాకాల అర్బన్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.


