మధ్యకోటలోని ఖుష్‌మహల్ మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శనివారం స్మార్ట్ రేషన్‌కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్వాతంత్య్ర వేడుకల అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,96,929 కార్డులు, 8,94,791 మంది లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కార్డులను పంపిణీ చేయగా.. నేడు సీఎం రేవంత్‌రెడ్డి స్మార్ట్‌కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో దొడ్డు బియ్యాన్ని ఎవరూ తినక తక్కువ ధరకే విక్రయించేవారని గుర్తు చేశారు. ప్రతినెల ఒక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తోందని వివరించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ స్మార్ట్‌కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్‌నాయక్ మంత్రి సురేఖను కలిసి డీలర్లకు రూ.ఐదువేల గౌరవ వేతనం, క్వింటాలుకు రూ.300 కమిషన్ ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, గణేశ్, డీఎస్‌ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, మార్కెట్ డైరెక్టర్ గజ్జెల శ్యాం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, మేర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజం, గోపాల నవీన్‌రాజు ఉన్నారు.


