నర్సంపేట/ఆలేరురూరల్ : నాన్న.. ఇంటికి వస్తున్నా.. నా పుట్టిన రోజు ఇంటివద్దనే జరుపుకుందాం.. అని తండ్రికి చెప్పాడు. కానీ, విధి కనికరించలేదు. రోడ్డు ప్రమాదంరూపంలో వచ్చిన మృత్యువు ఆ యువకుడిని కబళించడంతో పుట్టినరోజు నాడే అంతిమ యాత్ర నిర్వహించడంతో ముగ్దుంపురంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలంలోని ముగ్దుంపురం గ్రామానికి చెందిన చీకటి ప్రభాకర్ –భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి వివాహం జరగగా చిన్న కుమారుడు ప్రదీప్(26) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. ప్రదీప్ ఆగస్టు 15న తన బర్త్‌డే, చిన్నమ్మ ఇంట్లో బోనాల పండుగ, తర్వాత రోజు తన తల్లి ఆరునెలల మాసికం నిర్వహించేందుకు తండ్రికి ఫోన్ చేసి బైక్‌పై ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. దీంతో బైక్‌పై వద్దని బస్సులో రావాలని తండ్రి సూచించాడు. కానీ, ఓ యువతితో కలిసి హైదరాబాద్ నుంచి నర్సంపేటకు వస్తుండగా ఆలేరు బైపాస్‌లో బహద్దూర్‌పేట ఫ్లైఓవర్ దాటగానే వెనుక నుంచి గూడ్స్ వాహనం ఢీ కొట్టడంతో ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. యువతి కాలుకు తీవ్రగాయం కావడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వినయ్ తెలిపారు.
ఏడాదిలోనే ఇంట్లో మరో విషాదం..
ఆరు నెలల క్రితం తల్లి భాగ్యమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి కుటుంబం తేరుకుంటోంది. ఈక్రమంలో నాన్నతో ఆనందంగా గడుపుదామనుకున్న ప్రదీప్ మృతి చెందడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. యువకుడి తండ్రి చీకటి ప్రభాకర్ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తుండగా కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గుండెలవిసేలా విలపించాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి
వస్తుండగా ఘటన
నర్సంపేటలో విషాదఛాయలు


