రాయపర్తి: హైదరాబాద్‌లో ఉంటున్న ఓ కుటుంబం తన స్వగ్రామానికి బోనాల పండుగకు వస్తుండగా ఘట్‌కేసర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి చెందగా, తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన గూబ సురేష్, గూబ ఉమారాణి దంపతులు ఇరవై ఏళ్లక్రితం జీవనోపాధికోసం హైదరాబాద్‌కు వలసవెళ్లారు. వారాసీగూడలో నివాసం ఉంటూ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ సొంత గ్రామంలో ఆదివారం బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు బంధువుల ద్వారా తెలుసుకున్న సురేష్ తన భార్య ఉమారాణి, కుమార్తె గూబ శ్రావణి(30)తో కలిసి తమ టూ వీలర్‌పై సొంత గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఘట్‌కేసర్ బైపాస్ రోడ్డు వద్ద ఓ లారీ అజాగ్రత్తగా, అతివేగంతో వచ్చి వీరు ప్రయాణిస్తున్న టూవీలర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రావణి అక్కడికక్కడే మృతిచెందగా, భార్యాభర్తలు సురేష్, ఉమారాణికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. పండుగ కోసం వస్తుండగా ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి, తల్లిదండ్రులకు
తీవ్రగాయాలు
హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ఘటన..
సన్నూరు గ్రామంలో
విషాదఛాయలు


