కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.400 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనాభవనం ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. 50 ఏళ్ల కేయూ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ లక్ష్యాల వైపు మరింత దృఢంగా సాగాలని పిలుపునిచ్చారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ, మౌలిక వసతులు, విద్యార్థి సంక్షేమం, పరిపాలనా సంస్కరణల్లో విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. రూసా ప్రాజెక్టు ద్వారా రూ.50 కోట్లతో వివిధ పరిశోధన ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాలకు ఏఐసీటీ అనుమతి లభించిందన్నారు. కేయూలోని గ్రంథాలయ అభివృద్ధికి రూ.కోటి కేటాయించామని తెలిపారు. ఈ వేడుకల్లో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్‌డీ ఆచార్య వెంకట్రాంరెడ్డి, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేష్‌లాల్, రమ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బోధన, బోధనేతర ఉద్యోగులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు.


