కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. రంగశాయిపేట, సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బుధవారం ఆయన సందర్శించి విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 2,704 మంది ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా 32,448 నోట్‌బుక్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థికి 12 నోట్‌బుక్స్ అందించడం ద్వారా సుమారు రూ.600 వరకు తల్లిదండ్రులకు ఆదా అవుతుందన్నారు. మారిన పాఠ్యాంశాల ప్రకారం వార్షిక పరీక్షలకు 80, అంతర్గత మూల్యాంకనానికి 20 మార్కులు ఉంటాయని వివరించారు. కళాశాల ప్రిన్సిపాళ్లు సంపత్‌కుమార్, కరుణశ్రీ, లైబ్రేరియన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.


