సాక్షిప్రతినిధి, వరంగల్ :
వరంగల్ మహా నగరాన్ని ఆధునిక మౌలిక వసతులతో తీర్చిదిద్దుతూ ‘స్మార్ట్‌సిటీ’గా మార్చాలన్న లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇంకా పూర్తి కాని పనులు మిగిలే ఉన్నాయి. స్మార్ట్‌సిటీస్ మిషన్ (ఎస్‌సీఎం) అధికారికంగా 2025 మార్చి 31తో ముగిసినా.. గ్రేటర్ వరంగల్‌లో ఇప్పటికీ 16 ప్రాజెక్టులు పూర్తికాలేదు. దేశవ్యాప్తంగా గడువులు, పొడిగింపుల మధ్యన పదేళ్లు గడిచినా ఇంకా పనులు పెండింగ్‌లో ఉన్న స్మార్ట్‌సిటీల జాబితాలో గ్రేటర్ వరంగల్ కూడా ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరానికి మొత్తం 119 ప్రాజెక్టులు రూ.1,800 కోట్ల విలువతో చేపట్టగా.. 103 పనులు మాత్రమే పూర్తయ్యాయి. వీటి విలువ రూ.1,499 కోట్లు. ఇంకా రూ.301 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. మిషన్ గడువు ముగిసిన తర్వాత కూడా ఈ పనులు పూర్తికాకపోవడం నగర స్మార్ట్‌సిటీ లక్ష్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మిషన్ ముగిసిన తర్వాత కూడా మిగిలిన పనులను సకాలంలో పూర్తి చేయాలని, స్మార్ట్‌సిటీ కింద సృష్టించిన ఆస్తులకు నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రాలు, సంబంధిత ప్రత్యేక ప్రయోజన సంస్థలకు సూచించింది. అంటే మిషన్ ముగిసిందని పనులకు తెరపడినట్లు కాదు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత కొనసాగుతూనే ఉంటుంది. స్మార్ట్‌సిటీ మిషన్ కింద వరంగల్ మహానగరానికి విడుదలైన మొత్తం నిధులు, చేపట్టిన పనులు, ఖర్చయిన నిధులకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ క్లియరెన్స్ పొందాల్సి ఉంది.
వరంగల్ జేపీఎన్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న
ఫుట్‌పాత్‌లు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్, ఇతర తీగలు
స్మార్ట్ మిషన్ ముగిసి ఏడాది దాటినా.. పూర్తికాని 16 పనులు
‘గ్రేటర్’ పరిధిలో మంజూరైన పనులు 119, పూర్తి చేసింది 103
పదేళ్లలో 86.6 శాతంలోనే
‘స్మార్ట్‌సిటీ’ వర్క్స్
తాజా నివేదికలో కేంద్రం వెల్లడి
ఈ ఫొటోలో కనిపిస్తుంది భద్రకాళి బండ్. నగరవాసుల ఆహ్లాదం కోసం.. పర్యాటకులను ఆకర్షిచేందుకు ప్రభుత్వం స్మార్ట్‌సిటీకింద ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రీనరీ, ప్యాచ్ వర్క్‌లు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితేనే ఇది అందుబాటులోకి రానుంది.
ప్రధాన అసంపూర్తి పనులు ఇవే..
భద్రకాళి బండ్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అలాగే గ్రీనరీ, లైట్లు, ప్యాచ్ వర్క్‌లు చేపట్టాల్సి ఉంది. వడ్డేపల్లి బండ్‌పై 25 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు, గ్రీనరీ, లైటింగ్ తదితర పనులు చేపట్టాలి. కరీమాబాద్ కీర్తి బార్‌నుంచి రంగశాయిపేట క్రాస్ రోడ్డులో డక్ట్ పనులు మరో పదిశాతం చేయాలి. ఉర్సుగుట్టలో చేపట్టిన పనులు చాలామేరకు పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ములుగు రోడ్డు, నర్సంపేట రోడ్డు, ఖమ్మం గ్రాండ్ ఎంట్రెన్స్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. బయోమైనింగ్.. ప్రధాన రహదారుల అభివృద్ధి... సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ)ల ఏర్పాటు.


