నర్సంపేట రూరల్: నర్సంపేట పోలీస్‌స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత బుధవారం తనిఖీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నర్సంపేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సీపీకి సిబ్బంది ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భగా పలు రికార్డులను పరిశీలించిన ఆమె కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గోవాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు
నర్సంపేట: ప్రత్యేక టూర్ ప్యాకేజీలో భాగంగా నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి 36 సీట్లు గల సూపర్ లగ్జరీ బస్సు గోవా యాత్రకు వెళ్తుందని డిపో మేనేజర్ ఎం.సరస్వతి తెలిపారు. డిపోలో బుధవారం ఆమె మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ ఉదయం 5 గంటలకు బస్సు హైదరాబాద్ నుంచి హంపి క్షేత్రం ద్వారా కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం, ధర్మస్థల, ఉడిపి నుంచి మురుడేశ్వర్, గోకర్ణ దైవ దర్శనాల తర్వాత గోవాకు వెళ్తుందని పేర్కొన్నారు. గోవాలో ఒకరోజు అనంతరం హైదరాబాద్ నుంచి నర్సంపేటకు 20వ తేదీ రాత్రి 12 గంటలకు చేరుకుంటుందన్నారు. రానుపోను ఒక్కరికి రూ.5,500 ప్రయాణ చార్జి ఉంటుందని, ఐదు రోజుల యాత్రలో భోజనం, వసతి, గదుల ఖర్చు బాధ్యత పర్యాటకులదేనని తెలిపారు. ముందస్తు బుకింగ్ కోసం 9704644543 నంబర్‌లో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఆరుతడి పంటలు సాగుచేయాలి
నర్సంపేట రూరల్: ఎల్‌నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి విజయ్ భాస్కర్ సూచించారు. మహేశ్వరం గ్రామంలో రైతులకు ఆరుతడి పంటలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల్లో నీరు లేకపోవడంతో వరి పంటకు బదులు పెసర, మినుము, జొన్న, పొద్దు తిరుగుడు తదితర ఆరుతడి పంటలను సాగుచేయాలని కోరారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ భూగర్భ జలాలు పడిపోవడంతో ఆరుతడి పంటలు సాగుచేయాలని పేర్కొన్నారు. సదస్సులోకౌన్సిలర్ ఏపూరి శ్రీనివాస్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి కృష్ణకుమార్, ఏఈఓ వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చెట్లతోనే జీవకోటికి మనుగడ : డీసీఓ
సంగెం: చెట్లు జీవకోటికి మనుగడ అని జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా కాపులకనిపర్తి సొసైటీ ఆవరణలో బుధవారం వారు మొక్కలు నాటి మాట్లాడారు. చెట్లు ఉంటే జీవకోటికి ఆక్సిజన్ అందడంతో పాటుగా పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని పేర్కొన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రావు, మండల వ్యవసాయాధికారి జగదీశ్వర్, సంఘం కార్యవర్గ సభ్యులు రవీందర్, చేరాలు, పోశయ్య, వెంకటలక్ష్మి, కిషన్, కుమారస్వామి, కార్యదర్శి రమణాచారి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ డీఎస్.వెంకన్న పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో గురుకుల బాలుర సైనిక్ స్కూల్ నర్సంపేట అశోక్‌నగర్‌లో ఫిజిక్స్(1), ఇంగ్లిష్(2), మ్యాథ్స్(2) కెమెస్ట్రీ(01), మ్యాథ్స్(2) కెమిస్ట్రీ(1), జేఎల్ మ్యాథ్స్ (2), కెమిస్ట్రీ(1), పీజీటీ ఇంగ్లిష్(1) టీజీటీ ఇంగ్లిష్ (1), బాలుర గురుకులం నర్సంపేట జేఎల్ జువాలజీ(1), పీజీటీ ఇంగ్లిష్(1), టీజీటీ ఫిజికల్ సైన్స్(1), మూడు చెక్కలపల్లి బాలికల జూనియర్ కళాశాల జేఎల్ మ్యాథ్స్ (1) బాలికల గురుకులం పర్వతగిరి టీజీటీ ఫిజికల్ సైన్స్(1) బయోసైన్స్(1), బాలుర గురుకులం యాకూబ్‌పురా వరంగల్, జేఎల్ జువాలజీ(1) టీజీటీ తెలుగు(1), హనుమకొండ జిల్లాలో బాలికల గురుకులం(సీఓఈ) పెద్దమ్మగడ్డలో జేఎల్ మ్యాథ్స్(1), జనగామ జిల్లాలోని పాలకుర్తి బాలికల గురుకులంలో పీజీటీ మ్యాథ్స్ (1), ఫిజిక్స్(1), టీజీటీ ఫిజికల్ సైన్స్(1), బయోసైన్స్(1), హిందీ(1) లైబ్రేరియన్ (1) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈనెల 21న గిరిజన గురుకులం(సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ) పెద్దమ్మగడ్డ, ములుగురోడ్డు, వరంగల్‌కు ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.


