ఎంజీఎంలో వైద్యసేవలపై కలెక్టర్‌ ఆరా | - | Sakshi
Sakshi News home page

ఎంజీఎంలో వైద్యసేవలపై కలెక్టర్‌ ఆరా

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

ఎంజీఎంలో వైద్యసేవలపై కలెక్టర్‌ ఆరా

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని బుధవారం కలెక్టర్‌ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలు, మీడియాలో వచ్చిన కథనాలపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముందుగా.. ఆమె ఎంఏసీ, క్యాజువాలిటీతోపాటు డైట్‌ సెంటర్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎంఏసీ వద్ద ఓ రోగి బయట పడుకున్నట్లు సోషల్‌ మీడియాలో వచ్చిన దాని గురించి అడిగి అధికారులనుంచి వివరణ తీసుకున్నారు. ఓ సెక్యూరిటీ గార్డు డబ్బులు తీసుకుంటున్నట్లు వచ్చిన మీడియా కథనంపై ఆరా తీశారు. తమ పేషెంట్‌ను ఎంఏసీ వార్డులో అడ్మిట్‌ చేసుకోవడం లేదని, తమ యూనిట్‌ కాదని చెబుతున్నారని రోగి బంధువులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. క్యాజువాలిటీకి వెళ్లి వైద్య సేవల విషయంలో ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని డ్యూటీ డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పేషెంట్‌ అటెండెంట్‌ కలెక్టర్‌కు తమ సమస్యలు విన్నవించారు. దీంతో ఆమె వార్డుల్లోకి వెళ్లి స్వయంగా రోగులకు అందుతున్న వైద్య సేవల తీరును తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని కంప్లైంట్‌ బాక్స్‌ పరిశీలించారు. అనంతరం రోగులకు ఆహారాన్ని అందించే డైట్‌ను ఆమె ప్రత్యేకంగా పరిశీలించారు. అంతకుముందు అకడమిక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్‌ వెంట ఎంజీఎం సూపరింటెండెంట్‌ రాంకుమార్‌రెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ అశ్విని, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ దయాశీల, పలువురు వైద్యులు ఉన్నారు.

డైట్‌ సెంటర్‌ను సందర్శించిన

డాక్టర్‌ సత్యశారద

మీడియా కథనాలకు స్పందించి వార్డుల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement