ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎన్.రవి
హన్మకొండ అర్బన్: గడువులోగా సీఎంఆర్ పూర్తిచేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో 2025–26 ఖరీఫ్, రబీ సీజన్ల సీఎంఆర్ డెలివరీల పురోగతిని శనివారం సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు క్రమం తప్పకుండా రైస్‌మిల్లులను మానిటరింగ్ చేయాలని, మిల్లింగ్ పురోగతి, సీఎంఆర్ డెలివరీలపై ప్రతిరోజూ నివేదికలు సమర్పించాలని సూచించారు. సీఎంఆర్ బకాయిలు ఉన్న మిల్లర్లు వెంటనే డెలివరీలు పూర్తి చేయాలని, రబీ సీజన్‌కు సంబంధించి మిల్లింగ్ ప్రారంభించని వారు తక్షణమే కార్యకలాపాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే జమ చేయాలని, డిఫాల్ట్ అయిన మిల్లర్లపై ఆర్‌ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
సర్ గడువు పొడిగింపు..
భారత ఎన్నికల సంఘం సర్ దరఖాస్తుల గడువును ఆగస్టు 3 నుంచి ఆగస్టు 10 వరకు పొడిగించిందని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిజిటైజేషన్ వేగంగా జరుగుతోందని, మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను రీ–వెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలిపారు. గడువులోగా సంబంధిత బీఎల్‌ఓలకు సర్ ఫారాలు అందజేయాలని సూచించారు.


