కమలాపూర్: తాము విక్రయించిన మొక్కజొన్నలకు సంబంధించి పూర్తి డబ్బులు వెంటనే చెల్లించాలని మండలంలోని మక్క రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు తమకు చెల్లించాల్సిన డబ్బుల చెల్లింపుల్లో కోత విధించారని ఆరోపిస్తూ పలువురు మక్క రైతులు మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ నిర్వాహకులు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 22న మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 858 మంది రైతుల నుంచి 32,389 క్వింటాళ్ల మొక్కొజొన్నలు కొనుగోలు చేశారు. మొక్కజొన్నలు విక్రయించిన రైతుల ఖాతాల్లో ఆలస్యంగా (2 నెలల అనంతరం) మొక్కజొన్నల డబ్బులు జమచేశారు. ఆ డబ్బులు ట్రక్ షీట్ ప్రకారం కాకుండా ఒక్కో రైతుకు సుమారు 50 కిలోల నుంచి క్వింటాన్నర వరకు (రూ.1,200 నుంచి 3,600 వరకు) తక్కువ చెల్లించారు. ఇలా ఒక్క కమలాపూర్ మండలంలోనే మొక్కజొన్నలు విక్రయించిన రైతులకు సు మారు రూ.10 లక్షల వరకు తక్కువ చెల్లించారు. రైతులే స్వయంగా గన్నీ సంచులు కొనుగోలు చేసుకోగా, రవాణా కోసం లారీలు రాక ట్రాక్టర్ కిరాయి, హమాలీలకు ఎగుమతి, దిగుమతి ఖర్చులు మొత్తంగా ఒక క్వింటాకు రూ.120 చొప్పున ఖర్చయ్యాయని ఆ ఖర్చులు కూడా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, దీంతో ఒక్కో రైతుపై రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు అదనపు భారం పడిందని మక్క రైతులు ఆరోపించారు. తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని మక్క రైతులు కోరుతున్నారు. ఈవిషయమై పీఏసీఎస్ సీఈఓ వెంకటేశ్‌ను వివరణ కోరగా.. రైతులకు తక్కువ డబ్బులు చెల్లించిన విషయాన్ని, మరో 1,600 క్వింటాళ్లకు సంబంధించి రైతులకు అసలే డ బ్బులు చెల్లించలేదని మార్క్‌ఫెడ్ డీఎం దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై గోదాం ఇన్‌చార్జ్‌లతో సమీక్ష నిర్వహించి పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని త్వరలోనే రైతులకు పూర్తి డబ్బులు చెల్లిస్తామని డీఎం చెప్పినట్లు తెలిపారు.
పీఏసీఎస్ ఎదుట మక్క
రైతుల ఆందోళన
వెంటనే పూర్తి డబ్బులు
చెల్లించాలని డిమాండ్


