వరంగల్ క్రైం: అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, శాంతిభద్రతల నిర్వహణలో మరింత సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎస్.శ్వేత అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని పోలీస్ కంట్రోల్ రూం, కమాండ్ కంట్రోల్ రూంను సంబంధిత అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కంట్రోల్ రూం సిబ్బంది పనితీరు, అత్యవసర కాల్స్ స్వీకరణ విధానం, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, నగరంలోని వివిధ ప్రాంతాలపై నిఘా, సాంకేతిక వ్యవస్థల పనితీరును కమిషనర్ సమీక్షించారు. సీపీ వెంట అదనపు డీసీపీలు ప్రభాకర్‌రావు, శ్రీనివాస్, ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఆర్‌ఐ సతీశ్, క్లూస్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, ఎస్సై రోహిత్, ఆర్‌ఎస్సై శ్రవణ్‌కుమార్ ఉన్నారు.
వరంగల్ లీగల్: యునైటెడ్ వరంగల్ జిల్లా అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం జరిగింది. అధ్యక్షుడిగా యు.కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి అజ్మీరా కిరణ్ సింగ్, ఉపాధ్యక్షులుగా చెన్నూరి రమేశ్, కోశాధికారిగా బండారి కవిత ఎన్నికయ్యారు. తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు నూతన కమిటీ బాధ్యులు.. సభ్యులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
హన్మకొండ అర్బన్: భారత వైమానిక దళంలో ఎయిర్‌మెన్ (మెడికల్ అసిస్టెంట్), అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను ప్రారంభించిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనియామకాలకు సంబంధించిన ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ జూలై 6, 2026 ఉదయం 11 గంటలకు ప్రారంభమైందని, జూలై 26, 2026 రాత్రి 11:00 గంటలకు ముగుస్తుందని తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అర్హులైన యువత ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుని భారత వైమానిక దళంలో సేవలందించే అవకాశం పొందాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కోరారు.
కేయూ క్యాంపస్: టీజీసీపీగెట్–26 బుధవారం కూడా రాష్ట్రంలోని 22 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు కొనసాగాయి. ఉదయం సెషన్‌లో ఎంకామ్, ఎమ్మెస్సీ బాటనీ కోర్సులకు 6,037 మంది అభ్యర్థులు హాజరైనట్లు టీజీసీపీగెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. మధ్యాహ్నం సెషన్‌లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సులకు 3,294 మంది, సాయంత్రం సెషన్‌లో ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ అండ్ హెచ్‌ఆర్‌ఏ కోర్సుకు 376 మంది హాజరైనట్లు రాజేందర్ తెలిపారు. ఈనెల 16న ఉదయం సెషన్‌లో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.


