కేయూ పీజీ, డిగ్రీ కోర్సుల నూతన సిలబస్‌కు ఆమోదం | - | Sakshi
Sakshi News home page

కేయూ పీజీ, డిగ్రీ కోర్సుల నూతన సిలబస్‌కు ఆమోదం

Jul 16 2026 7:30 AM | Updated on Jul 16 2026 7:30 AM

కేయూ పీజీ, డిగ్రీ కోర్సుల నూతన సిలబస్‌కు ఆమోదం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ (నాన్‌ ప్రొఫెషనల్‌ ) పీజీ కోర్సుల నూతన సిలబస్‌ రూపొందించారు. దీన్ని కాకతీయ యూనివర్సిటీ స్టాండింగ్‌ కమిటీ ఆమోదించింది. బుధవారం అకడమిక్‌ కమిటీ హాల్‌లో నిర్వహించిన స్టాండింగ్‌ కమిటీలో చర్చించి ఆమోదించారు. అలాగే, రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో యూ జీ కోర్సులు (ఏఈడీపీ) అప్రెంటీస్‌షిప్‌ ఎంబెడెడ్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ కింద పలు నూతన కోర్సులను ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆయా కోర్సుల నూతన సిలబస్‌ను కూడా కేయూ స్టాండింగ్‌ కమిటీలో చర్చించి ఆమోదించారు.

పీహెచ్‌డీ పూర్తి చేసుకునేందుకు అవకాశం..

కేయూలోని వివిధ విభాగాల్లో పీహెచ్‌డీలో కొన్నేళ్ల క్రితం ప్రవేశాలు పొంది ప్రీ పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండి థీసెస్‌ సబ్మిట్‌ చేయకుండా ఉండి పీహెచ్‌డీ పూర్తి చేసే కాలపరిమితి పూర్తయిన వారికి అవకాశం ఇచ్చేందుకు కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునే వారికి ఆరునెలల్లో పీహెచ్‌డీ పూర్తిచేసుకునేలా అవకాశం ఇవ్వాలని స్టాండింగ్‌ కమిటీ నిర్ణయించి ఆమోదించింది.

పార్ట్‌టైంగా చదువుకునే అవకాశం..

కేయూలో బీటెక్‌, ఎంటెక్‌ కోర్సుల్లో పార్ట్‌టైంగా పాలిటెక్నిక్‌, వివిధ ఇంజనీరింగ్‌ రిలేటెడ్‌గా ఉండే డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు ప్రవేశాలు పొంది పార్ట్‌టైంగా చదువుకునే అవకాశం కల్పించాలనే విషయంపై స్టాండింగ్‌ కమిటీలో చర్చించారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ ఇలా అవకాశం కల్పించేలా ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులో ఉత్తీర్ణులైన వారికి కేయూలో కూడా బీటెక్‌, ఎంటెక్‌లో పార్ట్‌టైంగా కోర్సులో చేరేలా సాయంత్రం వేళల్లో ఆయా కోర్సులను నడిపాలనేది చర్చించారు. అయితే ఇందుకు ఏఐసీటీ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరంలో అవకాశం వస్తుందా? లేక వచ్చే ఏడాది అమలుచేయాలా అనే యోచనలో ఉన్నారు. ఈ స్టాండింగ్‌ కమిటీలో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం, వీసీ, రిజిస్ట్రార్‌ ఓఎస్‌డీ బి.వెంకట్రామ్‌రెడ్డి, వివిధ విభాగాల డీన్లు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement