కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో 2026–2027 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న టీజీసీపీజీఈటీ రెండో రోజు గురువారం 22 కేంద్రాల్లో ప్రశాంతంగా కొనసాగిందని సీపీజీఈటీ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్ కె. రాజేందర్ తెలిపారు. రెండోరోజు మొదటి సెషన్‌లో ఎంఏ ఎకనామిక్స్ కోర్సుకు 1,384మంది హాజరుకావాల్సి ఉండగా 1,143 మంది, ఎంఏ తెలుగు కోర్సుకు 2,946 మందికి 2,486 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సాయంత్రం సెషన్‌లో ఎమ్మెస్సీ సైకాలజీ, ఎమ్మెసీ డేటాసైన్స్ ప్రవేశ పరీక్షలకు 1,233 మందికి 1048 మంది అభ్యర్థులు హాజరయ్యారని కన్వీనర్ రాజేందర్ పేర్కొన్నారు.
నేటి పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఈనెల 10న జరగాల్సిన బీటెక్, ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ గురువారం తెలిపారు. బీటెక్ ఆరో సెమిస్టర్, ఫార్మ్‌డీ మూడో సెమిస్టర్ బీఫార్మసీ రెండో సెమిస్టర్, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 10న జరగాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలను రీషెడ్యూల్ కూడా చేసినట్లు తెలిపారు. ఈనెల 10న జరగాల్సిన బీటెక్ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25న, ఫార్మ్‌డీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23న, బీఫార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 18న, బీఫార్మసీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.


