హన్మకొండ: ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా పప్పు ధాన్యాల ఉత్పత్తి వైపు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశంలో పౌష్టికాహార భద్రతను మెరుగుపర్చడానికి, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి జాతీయ ఆహార భద్రతా మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆహార భద్రతా పథకం కింద పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి రైతులకు విత్తనాలు రాయితీపై అందిస్తోంది. స్థానిక రైతులను అపరాల సాగు వైపు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. హనుమకొండ జిల్లాలో పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు రైతాంగానికి రాయితీపై కంది, పెసర విత్తనాలను ప్రభుత్వం అందిస్తోంది. వర్షాధారంగా నీటి పారుదల సౌకర్యం ఉన్న నేలల్లో అంతర పంటగా, నేరుగా సాగు చేసుకోవచ్చు.
రాయితీపై కంది, పెసర
హనుమకొండ జిల్లాలో 550 ఎకరాల్లో కంది సాగుకుగాను 22 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా అయ్యాయి. 150 ఎకరాల్లో పెసర సాగుకు 4 కిలోల చొప్పున 150 కిట్లు వచ్చాయి. కందిలో పీఆర్‌జీ 176 (పాతది), ఎల్‌ఆర్‌జీ–52 (పాతది), ఎల్‌ఆర్‌జీ –133/33 (కొత్తవి) రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని రాయితీపై రైతులకు అందిస్తున్నారు. దీంతో పాటు కంది డబ్ల్యూఆర్‌జీ–255 రకం 100 కిట్లు, పెసరలో ఎంజీజీ–385 రకం అందుబాటులో ఉన్నాయి. కంది ఎల్‌ఆర్‌జీ–133/33 రకం ధర రూ.137 కాగా, రాయితీ రూ.60 పోను రైతులు రూ.77 చెల్లించాలి. ఎల్‌ఆర్‌జీ–52 రకం ధర రూ.136. ఇందులో రాయితీ రూ.36 పోను రైతులు రూ.100 చెల్లించాలి. అదేవిధంగా కంది డబ్ల్యూఆర్‌జీ–255 రకం కిట్లు, పెసర డబ్ల్యూజీజీ– 385 రకం కిట్లు రైతులకు ఉచితంగా అందిస్తున్నా రు. స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి రాయితీ ద్వారా కంది, పెసర విత్తనాలను పొందవచ్చు. పప్పుధాన్యాల సాగు.. భూమిలోని నత్రజనిని పెంచి నేల ఆరోగ్యాన్ని సంపన్నం చేస్తుంది. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండానే సేంద్రియ పద్ధతిలో సాగు చేయడానికి ఇది అనువైనది.
వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న క్రమంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి. పప్పు దినుసుల పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు రాయితీపై కంది, పెసర విత్తనాలు రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. పెసరను ఈనెల 15 వరకు, కందిని ఈ నెలాఖరు వరకు విత్తనాలు వేసుకోవచ్చు. – ఆదిరెడ్డి, సహాయ సంచాలకుడు,
వ్యవసాయ శాఖ
రాయితీపై కంది, పెసర విత్తనాలు


