గీసుకొండ: మండలంలోని ఊకల్‌హవేలిలోని ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం బౌమ, కృష్టాంగారక సప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారిని తేనెపట్టు రూపంలో ప్రత్యేకంగా అలంకరించి సవరస క్షీరాభిషేకం చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు, అర్చకులు శ్రీహర్ష ప్రత్యేక పూజలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
పౌష్టికాహారం తీసుకోవాలి
ఖానాపురం: గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని ఎంహెచ్‌ఎన్ (మెటర్నల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్) ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ సాజీద అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలో ఆశల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంహెచ్‌ఎన్ మాతా, శిశువు ఆరోగ్యం, పోషణ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కృషి చేయాలన్నారు. బీపీ, రక్తహీనత లాంటి పరీక్షలను ఎప్పటికప్పుడు గర్భిణులకు చేయాలన్నారు. ఐరన్, పోలిక్‌యాసిడ్ మాత్రలు, టీబీ వ్యాక్సిన్‌లు సకాలంలో వేయించాలన్నారు. వర్షాకాలంలో ప్రసవాలకు దగ్గరగా ఉన్న మహిళలు ఆస్పత్రులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో టీబీ నివారణ ప్రోగ్రాం ఆఫీసర్ అరుణ్‌కుమార్ జోషీ, డీపీహెచ్‌ఎన్‌ఓ మనోజ, వైద్యులు జ్యోతి, కల్పన, సునీత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదు
పోస్టర్ ఆవిష్కరణ
న్యూశాయంపేట: భారత రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొంది సేవా కార్యాక్రమాల్లో భాగస్వాములు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ గణేశ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త రెడ్‌క్రాస్ సొసైటీ జీవిత కాల సభ్యుడు మండల పరుశరాములు పాల్గొన్నారు.
స్వయం ఉపాధికి
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: గీసుకొండ మండలం శాయంపేటలో ఏర్పాటు చేసిన పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో టైలరింగ్ వృత్తిలో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సుగల ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు గీసుకొండ తహసీల్దార్ కార్యాలయం, డీఆర్‌డీఓ కార్యాలయం లేదా ప్రతీ సో మవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తులు అందించాలని కోరారు.
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
నర్సంపేట: మానవ (బాలల) అక్రమ రవాణాను అరికట్టాలని నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో మంగళవారం స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎఫ్‌ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ సహకారంతో ముద్రించిన మానవ (బాలల) అక్రమ రవాణాను అరికడదాం అనే వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మా ట్లాడుతూ మానవ అక్రమ రవాణాలో మనుషులే వస్తువులుగా అమ్మకం చెంది మోసపోతున్నారన్నారు. స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ మహిళలు, ఆడపిల్లలు అపరిచిత వ్యక్తుల ప్రవర్తన పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండి వారి పట్ల ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే డయల్ 100, ఆడపిల్లలు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్స్‌కు కాల్ ద్వారా సమాచారం అందించి రక్షణ పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో బి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.


