ప్రభుత్వ పాఠశాలల్లో ‘జెన్‌–ఏఐ’ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో ‘జెన్‌–ఏఐ’

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

కాళోజీ సెంటర్‌: ఏఐతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను పెంచేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమం ‘శిక్షా కోపైలట్‌ ఎంపవరింగ్‌ టీచర్స్‌ విత్‌ జెన్‌–ఏఐ’ని విస్తరిస్తూ పాఠశాల విద్యాపరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యాసంవత్సరం జిల్లాల్లోని 70 ప్రభుత్వ యూపీఎస్‌లు, 7 మోడల్‌ స్కూళ్లు, 10 కేజీబీవీల్లో దీనిని వర్తింపజేయనున్నారు.

పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం..

గతేడాది వికారాబాద్‌, సంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని 500 స్కూళ్లలో 1,000 మంది టీచర్లతో ఈ పైలట్‌ ప్రాజెక్టును ‘శిక్షణ ఫౌండేషన్‌’ భాగస్వామ్యంతో నిర్వహించారు. ఎస్‌ఈఆర్‌టీ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ ఏఐ టూల్‌తో ఉపాధ్యాయుల్లో డిజిటల్‌ నైపుణ్యాలు పెరిగాయని, పాఠాల తయారీ సులువైందని, విద్యార్థుల్లో భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని, ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల నుంచి వచ్చిన సానుకూల నివేదికల ఆధారంగా రాష్ట్రవ్యాప్త విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

ఉపాధ్యాయులకు ఉపయోగం ఇలా..

పాఠాల ప్రణాళిక : సిలబస్‌కు అనుగుణంగా ఆకర్షణీయమైన యాక్టివిటీలతో కూడిన లెస్సన్‌ ప్లాన్లను సులభంగా తయారు చేసుకోవచ్చు.

కంటెంట్‌ జనరేషన్‌ : విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా వ్యక్తిగతీకరించిన క్లాస్‌రూం కంటెంట్‌ను సృష్టించవచ్చు.

ప్రశ్నల నిధి : విద్యార్థుల ప్రాక్టీస్‌ కోసం, పరీక్షల కోసం సిలబస్‌ ఆధారిత కస్టమైజ్డ్‌ క్వశ్చన్‌ బ్యాంకులను క్షణాల్లో రూపొందించుకోవచ్చు.

తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో లభ్యం

ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించే గణితం, సైన్స్‌ (ఫిజికల్‌ అండ్‌ బయోలాజికల్‌ సైన్స్‌), ఇంగ్లిష్‌, సోషల్‌ స్టడీస్‌ ఉపాధ్యాయులకు ఈ పోర్టల్‌ అందుబాటులో ఉంటుంది. ఇంగ్లిష్‌, తెలుగు మీడియం ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు.

ఉపాధ్యాయులు సద్వినియోగం

చేసుకోవాలి

ఈ ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు శిక్షణ ఫౌండేషన్‌ ప్రత్యేక మేనేజర్లను నియమించనుంది. వారు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తారు. అలాగే ఉన్నతాధికారుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక డ్యాష్‌బోర్డ్‌ లాగిన్లను అందిస్తారు. ప్రతి మూడు నెలలకొకసారి శిక్షణ తరగతులు, టీచర్ల ఫీడ్‌బ్యాక్‌తో కూడిన త్రైమాసిక నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అర్హత కలిగిన ఉపాద్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– ఉండ్రాతి సుజన్‌ తేజ, ఏఎంఓ

ఉపాధ్యాయులకు తోడుగా

‘శిక్షా కోపైలట్‌’

6 నుంచి 10వ తరగతి బోధించే వారికి ఏఐ సాంకేతికత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement