సాక్షి, వరంగల్: జిల్లాలో జూలై తొలివారం ముగిసినా కూడా వరుణుడు కరుణించకపోవడంతో ‘వరి’ సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే 1,30,000 ఎకరాల్లో వరి సాగు చే స్తారని వ్యవసాయ అధికారులు ఖరీఫ్ సాగు ప్రణా ళిక రూపొందించినా లోటు వర్షపాతంతో అది కాస్త 30,000 ఎకరాలు తగ్గి 1,00,000 ఎకరాలు సాగు అవ్వొచ్చని అంచనా వేశారు. ఇందులో కూడా ఇప్పటివరకు బావులు, చెరువుల కింద కేవలం 24,000 ఎకరాల కోసం మాత్రమే వరి నార్లు పోశారు. ఇంకా 76,000 ఎకరాల్లో వరి నార్లు వేయాల్సి ఉండడంతో అన్నదాతల చూపు ఆకాశం పు మళ్లింది. జూలై రెండో వారంలో కురిసే వానలపైనే వరి సాగు ఆధారపడి ఉండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే 1,30,000 ఎకరాల సాగు నుంచి 1,00, 000 ఎకరాలకు సాగు అంచనా తగ్గడంతో ఆ 30,000 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు నీరు తక్కువగా అవసరమున్న కంది, పెసరు సాగు చేసే అవకాశముందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. అలాగే ఇంకా 76,000 ఎకరాల్లో వరి సాగు కోసం నార్లు పోయాల్సి ఉన్నా వరుణుడు కరుణించకపోతే ఇంకా ఎన్ని ఎకరాల్లో వరి సాగు తగ్గుతుందోనని వ్యవసాయ అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నీరు తక్కువగా అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తక్కువ కాలంలో చేతికొచ్చే కంది, పెసర పంటలు రైతులకు కొంత మేర నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని అధికారులు అవగాహన కలిగిస్తున్నారు. ఇదిలావుండగా ఈ నెల 4న జిల్లావ్యాప్తంగా కురిసిన 352.4 మిల్లీమీటర్ల వర్షంతో వరి నార్లు పోయడం ఊరటనిచ్చే అంశంగా మారింది.
పూర్తి కాని పత్తి సాగు..
జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట పత్తిని 1,20,500 ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. అయితే ఇప్పటివరకు 91,900 ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేశారు. ఇంకా 28, 600 ఎకరాల్లో విత్తనాలు వేయాల్సి ఉంది. ఇటీవల కొన్ని చోట్ల వర్షాలు కురవడంతో విత్తనాల ప్రక్రియ వేగం పుంజుకున్నప్పటికీ, అన్ని ప్రాంతా ల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. పెసర్లు 360 ఎకరాల లక్ష్యానికి గాను 290 ఎకరాలు, కందులు 254 ఎకరాల లక్ష్యానికి 125 ఎకరాల్లో సాగు పూర్తైంది.
లోటు వర్షపాతం ఎక్కడంటే..
జూన్ ఒకటి నుంచి జూలై ఏడో తేదీ వరకు జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. నర్సంపేటలో అత్యధికంగా 67 శాతం, ఖిలా వరంగల్‌లో 64 శాతం, గీసుగొండలో 59 శాతం, వరంగల్‌లో 58 శాతం, ఖానాపురంలో 54 శాతం, చెన్నారావుపేటలో 50 శా తం, పర్వతగిరిలో 49 శాతం, నెక్కొండలో 44 శాతం, సంగెంలో 43 శాతం, నల్లబెల్లిలో 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాయపర్తి (–18 శాతం), దుగ్గొండి (–14 శాతం), వర్ధన్నపేట (+1 శాతం) మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. జూలై రెండో వారంపైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు.
ఈసారి వరి సాగుపై
లోటు వర్షపాతం ఎఫెక్ట్
సాగు అంచనా 1,30,000ల నుంచి 1,00,000 ఎకరాలకు డౌన్
ఇప్పటివరకు వరి నాటేకల వేసింది 24,000 ఎకరాల్లోనే..
పత్తి టార్గెట్ 1,20,500 ఎకరాలున్నా.. ఇప్పటివరకు విత్తింది 91,900
ఎకరాలే..


