● ఏడీబీఐ జపాన్ కన్సల్టెంట్ డాక్టర్ కజుషి హషిమోటో
వరంగల్ అర్బన్/కాజీపేట అర్బన్: మలమూత్ర వ్యర్థాల శాసీ్త్రయ శుద్ధీకరణలో గ్రేటర్ వరంగల్ పనితీరు ప్రశంసనీయమని ఆసియా అభివృద్ధి బ్యాంకు సంస్థ(ఏడీబీఐ) జపాన్ కన్సల్టెంట్ డాక్టర్ కజుషి హషిమోటో అన్నారు. మంగళవారం విలీన గ్రామమైన అమ్మవారిపేటలో ఏర్పాటు చేసిన మలశుద్ధీకరణ కేంద్రాలను సందర్శించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌లో మలవిసర్జన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థపై ఏర్పాటు చేసిన సమావేశంలో జపాన్ బృందం.. కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్, బల్దియా కమిషనర్ టి.వెంకన్నతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా అమ్మవారిపేటలో రోజుకు 15 కిలోలీటర్ల సామర్థ్యంతో మలశుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పైరోలసిస్ విధానం ద్వారా మలాన్ని సేంద్రియ ఎరువుగా మార్చి వ్యవసాయ భూముల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు. శుద్ధి చేసిన నీటిని రహదారి మధ్య విభజన ప్రాంతాల్లోని మొక్కలకు వినియోగిస్తున్నట్లు వివరించారు. నగర అవసరాలకు అనుగుణంగా ఇటీవల రోజుకు 150 కిలోలీటర్ల సామర్థ్యం గల ఆధునిక మలశుద్ధీకరణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్‌లో అమలవుతున్న పారిశుద్ధ్య నిర్వహణ విధానాలు, మలశుద్ధీకరణ సాంకేతికత, వనరుల పునర్వినియోగ విధానం ఆదర్శప్రాయంగా ఉన్నట్లు డాక్టర్ కజుషి హషిమోటో అభినందించారు. సమావేశంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు మహేందర్, స్పందన, తదితరులు పాల్గొన్నారు.


