డీసీపీయూ విభాగంలో ఉన్న 12 పోస్టుల్లో 10 ఖాళీగా ఉన్నాయి. దత్తత, అనాథ పిల్లలకు స్పాన్సర్‌షిప్, బాల్య వివాహాల నియంత్రణలో కీలకంగా వ్యవహరించే పీఓ నాన్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్, తల్లిదండ్రులు లేని పిల్లలను చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో చేర్పించడంతో పాటు ఆపరేషన్ ముస్కాన్‌లో దొరికిన పిల్లలకు ఆశ్రయం కల్పించే బాధ్యత పర్యవేక్షించే పీఓ ఇన్‌స్టిట్యూషనల్ కేర్, పోక్సో కేసుల నష్టపరిహారం, కోర్టు, పోలీసు సంబంధింత పనులు చూసే ఎల్‌సీపీఓ ఖాళీగా ఉన్నాయి. అలాగే బాలలకు సంబంధించిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించే ఒక కౌన్సిలర్, ఇద్దరు సోషల్ వర్కర్లు, ఒక అవుట్ రీచ్ వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరు ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. అలాగే, జువెనల్ జస్టిస్ బోర్డు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో పాటు డీసీపీయూ యూనిట్‌లో మూడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్నవారికే అదనపు పనిభారం పడుతోంది. అలాగే, పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 సిబ్బంది రాత్రి విధులకు దూరంగా ఉంటుండడంతో బాలల సంరక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన విభాగ ఉన్నతాధికారి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా బాలల సంరక్షణ ఆపదలో పడిందనే ఆరోపణలొస్తున్నాయి.


