నిబంధనలకు నీళ్లు..
వరంగల్ అర్బన్: మినరల్ వాటర్ తాగుతున్నాం.. మా ఆరోగ్యానికి ఢోకా లేదని ధైర్యంగా ఉన్నారా.. మీరు తాగేది స్వచ్ఛమైన మినరల్ వాటరే అని అనుకుంటున్నారా.. ఆ నీటిని కాచి చల్లార్చకుండానే మీ పిల్లలకు తాగిస్తున్నారా.. అయితే ఆరోగ్యం చేజా రిపోతున్నట్లే.. నగరంలో అనేకమంది మినరల్ వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు సరఫరా చేస్తున్న నీరు స్వచ్ఛమైనది కాదని, ఆ నీటిలో కనీస నాణ్యత లేద ని మీకు తెలుసా? ఔను.. చాలా ప్లాంట్లలో నిబంధనలకు విరుద్ధంగా అండర్‌గ్రౌండ్ నుంచి తీసిన నీటికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా క్యాన్లు, ప్యాకెట్లలోకి నింపుతున్నారు. దీనిపై కా ర్పొరేషన్ ప్రజారోగ్య విభాగం దృష్టి సారించకుంటే ప్రజారోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదముంది.
12 ప్లాంట్లకు మాత్రమే బీఐఎస్ గుర్తింపు..
వరంగల్ నగరవాసులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేషన్ సరఫరా చేసే నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో చాలా మంది మినరల్ వాటర్‌పై ఆధారపడుతున్నారు. దీంతో నగరంలో ఇబ్బడి ముబ్బడిగా గ్రౌండ్ వాటర్‌ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. తక్కువ ధరకే నీటిని సరఫరా చేస్తామంటూ అనేక మంది అనుమతి లేకుండా, కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 450కి పైగా గ్రౌండ్ వాటర్‌ప్లాంట్లు, 3,500 వరకు ప్యూరిఫైడ్ వాటర్‌ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో 12 మాత్రమే బీఐఎస్ గుర్తింపు కలిగి ఉన్నాయి.
రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం
నగరంలో ఉన్న 450 ప్లాంట్ల నుంచి రోజుకు లక్షల లీటర్ల నీళ్లు ఉత్పత్తి అవుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ప్రతీ వాటర్ ప్లాంట్ నుంచి 18 లక్షల లీటర్ల వరకు నీరు ఉత్పత్తి అవుతోంది. మినరల్ పేరుతో విచ్చలవిడిగా రసాయనాలు కలిపిన ఈ నీరు క్యాన్లు, ప్యాకెట్ల రూపంలో నివాస గృహాలు, హోటళ్లు, దుకాణాలకు సరఫరా అవుతోంది. 20 లీటర్ల వాటర్ క్యాన్‌కు రూ.10 నుంచి రూ.30 వరకు, వాటర్ ప్యాకెట్ రూ.2 చొప్పన విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు రూ.20 లక్షలకు పైగా వ్యాపారం జరుగుతోంది.
పట్టించుకోని అధికార యంత్రాంగం
నిబంధనలు పాటించకుండా ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ప్రజారోగ్య విభాగం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. వాటర్, ఇండస్ట్రియల్ డిపార్టుమెంట్లు ఈ ప్లాంట్లను పర్యవేక్షించడం లేదు. డబ్బులిచ్చి మరీ రోగాలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. వేసవిని తమ ‘మార్కెట్‘కు అనుకూలంగా ఎంచుకొని అక్రమార్కులు నగరప్రజలే టార్గెట్‌గా విజృంభిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. నామమాత్రంగా దాడులు నిర్వహించినా అధికారులపై రకరకాల ఒత్తిళ్లు వస్తున్నాయి. అయితే, ఇదే పరిస్థితి ఉంటే ‘మంచి’ నీటి రూపంలో మనకు అనారోగ్యంతో పాటు ఆర్థిక నష్టం కూడా జరుగుతోంది. గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన వాకటి కరుణ పర్యవేక్షణలో అనుమతి లేని ప్లాంట్లను మూసివేసేందుకు జిల్లా అధికారులతో కమిటీని నియమించి, తనిఖీలు చేసి సీజ్ చేశారు. కొన్నేళ్లుగా ఆహార కల్తీ నిరోధక శాఖ, రెవెన్యూ, గ్రేటర్ వరంగల్ అధికారులు వాటర్‌ప్లాంట్ల వైపు చూడడం మరిచిపోయారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలు పాటించని వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలు పాటించని వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు
నీటిలో విచ్చలవిడిగా రసాయనాల వాడకం
వ్యాధులబారిన పడుతున్న నగర ప్రజలు
పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ అధికారులు
వాటర్ ప్లాంట్‌కు బీఐఎస్ అనుమతి తీసుకోవాలి. ఏడాదికోమారు రెన్యువల్ చేసుకోవాలి. రూ.90 వేల ఫీజు చెల్లించాలి. విశాలమైన ప్రాంతంలో హెచ్‌డీపీ, స్టీల్ పైపులు ఏర్పాటు చేయాలి. ఐఎస్‌ఐ మార్కు కలిగిన ఫిల్టర్ మిషన్లు ఉండాలి. నీటి ట్యాంకులు ఇతర సామగ్రి నాణ్యమైనవి వినియోగించాలి. జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ నుంచి అనుమతి పొందాలి. వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. బల్దియా నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలి. ఇద్దరు టెక్నీషియన్లు ఉండాలి. ఎప్పటికప్పుడు వాటర్ శాంపిల్ పరీక్షలు చేయాలి. కానీ, వీటిలో ఒక్క నిబంధన కూడా ప్లాంట్ల నిర్వాహకులు పాటించడం లేదు. గల్లీకో చోట విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తూ నీటి వ్యాపారం సాగిస్తున్నారు.


