● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డులోని డ్రెయినేజీల పూడికతీత పనులను చైర్మన్ పాలకుర్తి సారంగపాణితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగాది శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. గతంలో కొంతమంది వద్ద డబ్బులు తీసుకుని మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇచ్చి తర్వాత తొలగించారనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ అంశఽంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన పట్టణంలో అవసరమైన పారిశుద్ధ్య కార్మికులను అదనంగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి 250 మంది కార్మికులను నియమించాలని ఇటీవల సీఎంకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే స్వయంగా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ షీభారాణి రాజేందర్, మున్సిపల్ కమిషనర్ సుఽధీర్‌కుమార్, కౌన్సిలర్లు కమిలి, పాపారావు, తిరుపల్లి వాణి, ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, నాయకులు ఎండీ చోటు, ఎండీ అప్సర్ తదితరులు పాల్గొన్నారు.


