పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు! | - | Sakshi
Sakshi News home page

పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు!

Mar 20 2026 9:20 AM | Updated on Mar 20 2026 9:20 AM

పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు!

తగ్గిపోవడానికి కారణాలెన్నో..

పిచ్చుకల సంతతి తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్తు ,పెట్రోల్‌ వంటివి వినియోగం, సెల్‌టవర్ల కారణంగా పెరుగుతున్న రేడియేషన్‌, పట్టణీకరణ పేరుతో ఎక్కడికక్కడ సిమెంట్‌ ఇళ్ల నిర్మాణాలు, కనీసం ఇవి గూడు పెట్టుకునే ఆవాసాలు లేకపోవడం, వ్యవసాయంలో పురుగు మందులు, క్రిమి సంహారక మందుల వినియోగం బాగా పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

ఖిలా వరంగల్‌: జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన అద్భుత జంతుజాలమే పక్షులు.. ఈ సంపద ప్రకృతి వరప్రసాదం. అందులో పిచ్చుకలు.. ప్రకృతికి అందం, మానవాళికి జీవవైవిధ్యంతోపాటు ఆనందాన్ని అందిస్తాయి. ఒకప్పుడు ఉదయం లేవగానే నగర, పట్టణ,గ్రామాల్లో ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. ఇళ్లల్లోకి వచ్చి కిచకిచమంటూ పలకరించేవి. చప్పుడు చేయగానే తుర్రుమంటూ ఎగిరిపోతుండేవి. కాలక్రమంలో ఈబుజ్జి పక్షులు మన జీవితాల నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించడంతో పాటు వాటి ప్రాఽధాన్యం మానవాళికి తెలియజేయడం కోసం ఏటా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

పిచ్చుకలతో మానవాళికి మనుగడ..

చూసేందుకు చిన్నవిగా ఉండే పిచ్చుకలు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పంటలను ఆశించే వివిధ కీటకాలను తినడం ద్వారా తెగుళ్లు రాకుండా పరోక్షంగా రైతులకు మేలు చేస్తాయి. వివిధ పంటల్లో పరాగ సంపర్కం జరిగేలా చేసి దిగుబడులు పెంచుతాయి. నేలను సారవంతం చేస్తూ భూమిలో మొక్కలు మొలకెత్తేందుకు దోహదం చేస్తాయి.

మనమేం చేయాలంటే..

అవగాహన ఉన్న కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు తమ పంట పొలాల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా టీ ఆకారంలో కర్రలను ఉంచడం ద్వారా వాటిపై పక్షులు వాలుతుంటాయి.

● పొలం గట్లపై మోదుగు, సీమ చింత, మల్బ రీ, నేరేడు వంటి పండ్ల చెట్లను పెంచడం ద్వారా పక్షులు పంట పొలాలకు దగ్గరలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.

● నగరాల్లో ప్రత్యేక గూళ్లు లభ్యమవుతున్నాయి. ఇంటి ఫోర్టికో వద్ద, పరిసరాల్లో ఆ గూళ్లను ఏర్పాటు చేసి అక్కడక్కడా డబ్బాల్లో ధాన్యం గింజలు, తాగునీరు అందుబాటులో ఉంచాలి.

సంరక్షణ బాధ్యతగా భావించాలి..

మానవ జాతి మనుగడతో ముడిపడి ఉన్న పిచ్చుకల సంరక్షణను బాధ్యతగా భావించాలి. అందరూ తమ ఇళ్ల ముందు మొక్కలు నాటి, ఇంటి సరిసరాల్లో పిచ్చుకలు నివసించడానికి వీలుగా చెక్కతో తయారు చేసిన డబ్బాలను అమర్చాలి. వాటిలో ధాన్యం, నీళ్లు అందించాలి. పిచ్చుకలు ఇళ్లల్లో నివసిస్తే ఆ ఇంటికి శుభ సూచకంగా భావిస్తారు. – గాదె స్వరూప్‌రెడ్డి

పక్షి ప్రేమికుడు హనుమకొండ

మందుల వినియోగం తగ్గాలి..

తెగుళ్లు నివారణ కోసం విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వినియోగం వల్ల పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులతోపాటు పిచ్చుకల మనుగడకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది. రైతు నేస్తాలుగా వీటిని పరిగణించి వాటికి ప్రత్యేకంగా ఆవాసాలు కల్పించాలి. పిచ్చుకల దినోత్సవాలను నిర్వహించడం ద్వారా ఈచిన్న పక్షులను మన జీవితాల్లోకి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగాలి.

– డాక్టర్‌ అరుణ్‌జ్యోతి, కేవీకే శాస్త్రవేత్త

ఆహ్లాదాన్ని పంచే అతి చిన్న పక్షులు

రక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత

నేడు ప్రపంచ

పిచ్చుకల దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement