జనవరితో పోలిస్తే ఏకంగా 270 శాతం పెరుగుదల
● అప్పుడు రోజుకు 16,000.. ఇప్పుడు 59,200 బుకింగ్
● పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ప్రజల్లో అపోహలు
● గ్యాస్ ఏజెన్సీలపై అదనపు ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి
● ఇదే అదునుగా కొన్నిచోట్లా సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్
● నిఘా ఉంచామంటున్న పౌరసరఫరాల అధికారులు
జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు : 16 (వరంగల్ నగరంలో 12,
నర్సంపేటలో 2, వర్ధన్నపేటలో 1, సంగెంలో ఒకటి)
గ్యాస్ సిలిండర్ కంపెనీలు : ఇండేన్, హెచ్‌పీ, భారత్
గురువారం బుకింగ్ కాల్స్ : 48,000
శుక్రవారం బుకింగ్ కాల్స్ : 59,200
గతనెలలో ఒకరోజు పంపిణీ చేసిన
సిలిండర్లు : 15,200
ప్రస్తుతం ఒకరోజు పంపిణీ చేస్తున్న
సిలిండర్లు :19,200
డొమెస్టిక్ సిలిండర్ కనెక్షన్లు : 3,15,056
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు : 1,452
524 సిలిండర్లతో ఒక లారీ లోడ్ అంటే నెలకు వచ్చేవి : 800
అంటే జిల్లాకు రోజుకు వచ్చే
లోడ్‌లతో కూడిన లారీలు : 26
సాక్షి, వరంగల్: పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం వరంగల్ జిల్లాపై పడింది. అక్కడి నుంచే అవుతున్న ఎల్పీజీ సరఫరా దెబ్బతింటుందనే అపోహలు ప్రజల్లో నెలకొనడంతో ముందస్తుగా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో అవసరం లేకపోయినా కొందరు వినియోగదారులు బుకింగ్ చేస్తుండడంతో అసలు అత్యవసరం ఉన్నవారికి సమయానికి సిలిండర్ రాక తిప్పలు తప్పడం లేదు. జనవరిలో 16 ఏజెన్సీల పరిధిలో రోజుకు 16,000 వరకు గ్యాస్ బుకింగ్ అయితే, ఇప్పుడు ఏకంగా శుక్రవారం ఒక్కరోజే 59,200 బుకింగ్ అవుతున్నాయి. అంటే ఏకంగా 270 శాతం బుకింగ్ పెరుగుదల ఉన్నట్లు ఆయా ఏజెన్సీల సరాసరి గణాంకాలు చెబుతున్నాయి. జనవరిలో రోజుకు సగటున 16,000 వరకు బుకింగ్ ఉంటే.. ఫిబ్రవరిలో లారీ యజమానులు సమ్మె చేయడంతో గ్యాస్ పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే మార్చి తొలివారం నుంచి లారీలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక గ్యాస్ సరఫరా అంతా సర్దుకుంటుందనుకున్న తరుణంలో ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో మళ్లీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అదనపు ఒత్తిడి పడే పరిస్థితి ఎదురవుతోంది.
గతంలో ఒక ఏజెన్సీలో రోజుకు వెయ్యి బుకింగ్ జరిగితే 900 వరకు గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు చేరవేసేవారు. ఇప్పుడు ఒక్కరోజే 3,700 బుకింగ్ అవుతుంటే కొంత కష్టపడినా 1200 వరకు గ్యాస్ సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకు చేర్చగలుగుతున్నా రు. దీన్నిబట్టి గ్యాస్ సిలిండర్లు ఉన్నా సిబ్బందితోనే వినియోగదారుడి ఇంటికి సిలిండర్ వచ్చేవరకు రో జుల సమయం పట్టే అవకాశముందని డీలర్లు అంటున్నారు. అయితే, ఇటీవల డొమెస్టిక్ సిలిండర్‌కు రూ.60, కమర్షియల్ సిలిండర్‌కు రూ.115 పెరిగినా అది భారమనుకొని ప్రజలు ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంటే చాలనుకుంటున్నారు.
బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలే..
డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొందరు దళారులు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించే అవకాశం ఉండడంతో పౌరసరఫరాల విభాగాధికారులు అటువైపుగా కన్నేశారు. అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై ఇప్పటికే నిఘా ఉంచారు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ల రాక తక్కువవడంతో గృహ వినియోగదారుల సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు ఉపయోగించడం, ఏజెన్సీల నుంచి సిలిండర్లను మళ్లించడం వంటి వాటిపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకోసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి వినియోగదారులు ఎల్పీజీ సిలిండర్లు బుక్ చేసుకోవాలి. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దు. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తాం. ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోంది.
– కలెక్టర్ల వీసీలో రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


