పోటెత్తిన ఓటర్లు
నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో 85.42 శాతం పోలింగ్ నమోదు
సాక్షి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసింది. నర్సంపేట మున్సిపాలిటీలోని 30 వార్డుల నుంచి 120 మంది, వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల నుంచి 50 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్స్‌ల్లో నిక్షిప్తమైంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన పోలింగ్ చాలాచోట్ల సాయంత్రం ఐదు గంటల వరకు ముగిసింది. కొన్ని పోలింగ్ బూతుల్లో అప్పటికే క్యూలైన్లలో నిలిచిన ఓటర్లకు అవకాశం ఇవ్వగా సాయంత్రం 6.30 వరకు జరిగింది. ఈ రెండు మున్సిపాలిటీల్లోని 42 వార్డుల్లో 51,494 మంది ఓటర్లుంటే 43,985 (85.42 శాతం) మంది ఓటు వినియోగించుకున్నారు. పురుషులు 21,021 మంది (84.93 శాతం), 22,961 (85.87 శాతం) మంది మహిళలు ఓటేశారు. పురుషులు 70 మంది, మహిళలు 100 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటు వినియోగించుకున్నారు.
చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం..
నర్సంపేటలో 60, వర్ధన్నపేటలోని 20వ పోలింగ్ కేంద్రాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. పటిష్ట పోలీసు బందోబస్తుతో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పెద్దగా ఎక్కడ గొడవలు జరగలేదు. అలాగే, పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు వీల్‌చైర్ సౌకర్యం కల్పించారు. యువత, మహిళలు ఉత్సాహంగా ఓటేసిన అనంతరం కొన్ని బూతుల్లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ల వద్ద చేతికి సిరా చుక్క చూపిస్తూ సెల్ఫీలు దిగడం కనిపించింది. కొన్ని వార్డుల్లో పార్టీల కండువాలు కప్పుకొని తిరుగుతున్న నాయకులను పోలీసులు చెదరగొట్టారు. బీఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తి డబ్బులు పంచుతున్నాడని పట్టుకున్నారు. నర్సంపేటలోని 144 బ్యాలెట్ బాక్స్‌లను వ్యవసాయ మార్కెట్ యార్డు స్ట్రాంగ్‌రూం, వర్ధన్నపేటలోని 52 బ్యాలెట్ బాక్స్‌లను మున్సిపల్ కార్యాలయ స్ట్రాంగ్‌రూంకు పటిష్ట బందోబస్తు మధ్య తరలించారు. ఈ ఓట్లను శుక్రవారం లెక్కించనున్నారు. ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు.
వార్డులు, ఓటర్లు, పోలైన ఓట్ల వివరాలు..
మొత్తం వార్డులు 42 పురుషులు మహిళలు ఇతరులు
మొత్తం ఓట్లు 51,494 24,751 26,739 4
పోలైన ఓట్లు 43,985 21,021 22,961 3
పోలింగ్ శాతం 85.42 84.93 85.87 75
నర్సంపేట మున్సిపాలిటీ (30 వార్డులు)..
మొత్తం ఓట్లు పురుషులు మహిళలు ఇతరులు
40,968 19,642 21,323 3
పోలైన ఓట్లు పురుషులు మహిళలు ఇతరులు
34,908 16,638 18,268 2
(85.21%) (84.71%) (85.67%) (66.67%)
వర్ధన్నపేట మున్సిపాలిటీ (12 వార్డులు)
మొత్తం ఓట్లు పురుషులు మహిళలు ఇతరులు
10,526 5109 5416 1
పోలైన ఓట్లు పురుషులు మహిళలు ఇతరులు
9077 4383 4693 1
(86.23 %) (85.79%) (86.65%) (100%)


