పోలీసులపై బీజేపీ అధ్యక్షుడి అసహనం
నర్సంపేట: పట్టణంలోని పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం పలు పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పదో వార్డు బీజేపీ అభ్యర్థి తాళ్లూరి వసంతకుమారి పోలింగ్ బూత్‌లో తిరుగుతుండగా కానిస్టేబుళ్లు బీజేపీకి అనుబంధంగా ఉన్న చీర కట్టుకుని ఎన్నిసార్లు తిరుగుతావని ప్రశ్నించారు. రవికుమార్ అక్కడకు చేరుకుని చీర విషయంలో అభ్యంతరాలు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు మరికొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద కానిస్టేబుళ్ల లాఠీలకు మేకులు ఉండడాన్ని చూసి నిలదీశారు. ఓటు వేయడానికి వచ్చే వారిని ఈ విధంగా భయటపెట్టడం సరికాదని, లాఠీలను వెంటనే తీసి వేయాలని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వెంట బీజేపీ నాయకుడు కంభంపాటి పుల్లారావు ఉన్నారు.


