మిమిక్రీ కళను చాటిన నేరెళ్ల
హన్మకొండ కల్చరల్: మిమిక్రీ అనే ఒక కళ ఉందని చాటి చెప్పిన మహానుభావుడు నేరెళ్ల వేణుమాధవ్ అని సినీ, మిమిక్రీ కళాకారుడు ఫన్‌స్టార్ శివారెడ్డి అన్నారు. వేణుమాధవ్ రాసిన మిమిక్రీ కళ వ్యాకరణం పుస్తకంతో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధ్వన్యనుకరణ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 94వ జయంతిని ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించారు. వేణుమాధవ్ కళాప్రాంగణంలో స్మారక ప్రతిభా పురస్కార ప్రదానం, మిమిక్రీ కళాకారుల స్వరార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ కార్యదర్శి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శివారెడ్డి, కవి, గాయకుడు వరంగల్ శ్రీనివాస్, జబర్దస్త్ ఫేమ్, సినీనటుడు రాకింగ్ రాకేశ్, నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ నిర్వాహకురాలు నేరెళ్ల శోభావతి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్‌కు చెందిన కవి, కథారచయిత, నవలాకారుడు రామా చంద్రమౌళిని శాలువా, జ్ఞాపికతో సన్మానించి పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడుతూ నేరెళ్ల వేణుమాధవ్ ప్రతిభా పురస్కారం ప్రతిష్టాత్మకమైందని పేర్కొన్నారు. వేణుమాధవ్ శిష్యుల మిమిక్రీ ప్రదర్శన ఆహుతులను అలరించింది. కార్యక్రమంలో కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, నేరెళ్ల శ్రీనాఽథ్, నేరెళ్ల రాధాకృష్ణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
సినీ, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి


