చట్టసభల్లో ప్రస్తావించాలి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్)లో యువతకు ఉద్యోగాలివ్వాలని శని, ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినట్లు రైల్వే జేఏసీ కన్వీనర్ దేవుళ్లపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు తెలిపారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డిని కలిసి ఉమ్మడి జిల్లాకు 65 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని, రైల్వే యాక్ట్ అప్రెంటీస్ పూర్తి చేసిన పిల్లలకు, తెలంగాణ నిరుద్యోగులకు 35 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఉద్యోగాల కల్పనపై శనివారం రాజకీయ పార్టీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఈ అంశాలను ప్రస్తావించాలని కోరారు. ముఖ్యమంత్రితో రైల్వే మంత్రికి ఉత్తరం రాయించేలా ఎమ్మెల్యేలు తోడ్పడాలని కోరారు. వినతి పత్రాలు ఇచ్చిన వారిలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్‌యాదవ్, విజయశ్రీ రజాలి, జలగం రంజిత్‌రావు, సంపత్‌రెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య, సీపీఐ నాయకులు మద్దెల మల్లేశం, వెంకటరాజ్యం, వివిధ పార్టీల నాయకులు, అయోధ్యపురం భూనిర్వాసితులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి
ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చిన రైల్వే జేఏసీ బృందం


