గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
వర్ధన్నపేట: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. ముంపునకు గురవుతున్న మండలంలోని కట్య్రాల గ్రామాన్ని శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలం ఉండి అర్హులైన వారికి, స్థలం లేని కుటుంబాలకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా కాలనీ వరద ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రమాదాలకు కారణమవుతున్న మైనార్టీ కాలనీలో ఇళ్ల మీదుగా వెళ్తున్న 11కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించి, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అసంపూర్తి పనులను
త్వరగా పూర్తిచేయాలి
సంగెం / గీసుకొండ: ఉపాధి హామీ పనులు ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న పనులన్నింటిని త్వరిగతిన పూర్తి చేయాలని అధికారులను జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ రాంరెడ్డి ఆదేశించారు. సంగెం, గీసుకొండ మండలాల్లో పశువుల పాక, నిర్మాణంలో ఉన్న సామూహిక మరుగుదొడ్లు, నర్సరీలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలకు అవసరమైన మట్టి, విత్తనాలను తెప్పించుకుని ఆయా గ్రామాల్లో ఉపయోగకరమైన మొక్కలు పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా గతంలో వీఓఏగా పనిచేస్తూ రాజీనామా చేసి కుంటపల్లి సర్పంచ్‌గా గెలుపొందిన పెంతల సువర్ణను ఆయన అభినందించారు. గీసుకొండ మండలంలోని కొనాయమాకుల, ఊకల్ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను రాంరెడ్డి పరిశీలించారు. నర్సరీల్లోని బ్యాగులను ఎర్రమట్టితో నింపి విత్తనాలు పెట్టాలన్నారు. అనంతరం గ్రామాల్లో ఔషధ, నీడనిచ్చే, పూల మొక్కలను నాటాలని సూచించారు. పశువుల షెడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు పేర్ల లలిత, సువర్ణ, వజ్ర రాజు, కక్కెర్ల సుభాష్, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓలు గణేష్, చంద్రకాంత్, పంచాయతీ కార్యదర్శులు రవీందర్, వాజీద్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతిభను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు
కేయూ క్యాంపస్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఈస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌ను శనివారం కాకతీయ యూనివర్సిటీలోని క్రీడా మైదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.విజయచందర్‌రెడ్డి, రాష్ట్ర బాధ్యులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గ్రామీణ యువత కోసం తెలంగాణ గోల్డ్‌కప్ క్రికెట్–2025 (ఈస్ట్‌జోన్) క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 8 జిల్లాల హనుమకొండ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాల జట్లు ఈటోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి.
గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి


