ఇన్నర్ రింగ్‌రోడ్ పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ఇన్నర్ రింగ్‌రోడ్ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. రింగ్ రోడ్ పనుల పురోగతిపై బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టరేట్‌లో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరాభివృద్ధిలో భాగంగా ఖిలా వరంగల్, ఏనుమాముల, గొర్రెకుంట ప్రాంతాల మీదుగా నిర్మాణంలో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్‌రోడ్ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు సమగ్ర నగరాభివృద్ధికి జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ సుమ, కుడా పీఓ అజిత్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, ఖిలావరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
మద్ది మేడారం జాతరపై సమీక్ష
నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారంలో జనవరి 28 నుంచి జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాతర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతర కాలంలో భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. రోడ్ల అభివృద్ధి, ఆలయ పరిసరాల పరిశుభ్రత, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా వైద్యసేవలు, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యం, ఇతర సదుపాయాలు, వాహనాల రద్దీ నివారణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాల కేటాయింపు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. జాతరలోపు పనులు పూర్తియ్యేలా ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్‌డీఓ ఉమారాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, రోడ్డు భవనాల శాఖాధికారి రాజేందర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఇజ్జగిరి, డీపీఓ కల్పన, ప్రధాన పూజారి నాగరాజు, రెవె న్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


