యూరియా కోసం బారులు
● తోపులాటలో
గాయపడిన మహిళ రైతు
నెక్కొండ: యాసంగి సాగు చేస్తున్న రైతులు.. యూరియా బస్తాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని నెక్కొండ, రెడ్లవాడ రైతు వేదికల్లో యూరియా వచ్చిందన్న సమాచారం మేరకు శనివారం తెల్లవారుజామున, ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా రైతులు చేరుకున్నారు. రెడ్లవాడ పీఏసీఎస్‌కు కేటాయించిన యూరియా బస్తాలు రైతు వేదికకు రావడంతో రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో రెడ్లవాడ శివారు మూడెత్తుల తండాకు చెందిన మహిళ రైతు మూడు విజయ కిందపడిపోగా, ఆమె కాలుకు గాయమైంది. విజయను నెక్కొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆమె భర్త సుమన్ తరలించాడు. కాగా, పీఏసీఎస్‌లు, హాకా సెంటర్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు యూరియా పంపిణీ చేస్తున్నా అవి రైతుల అవసరాలకు సరిపోవడం లేదు. మొక్కజొన్న పంటకు మొదటి, రెండో దఫాల్లో ఎరువులు వేయాల్సిన సమయం కావడంతో వారికి ఎదురుచూపులు తప్పడంలేదు. ఈ క్రమంలో ఒకటి, రెండు బస్తాలు మాత్రమే అందించి అధికారులు చేతులెత్తేస్తున్నారు.
యూరియా కోసం బారులు


