లెప్రసీ కేస్ డిటెక్షన్ సర్వే పూర్తి చేయండి
డీఎంహెచ్‌ఓ అప్పయ్య
వేలేరు: లెప్రసీ కేస్ డిటెక్షన్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మల్లికుదుర్ల ఆరోగ్య ఉపకేంద్రం, గుండ్లసాగర్‌లో నిర్వహిస్తున్న ఔట్ రీచ్ ఇమ్యునైజేషన్ సెషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి నాలుగు ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్న లెప్రసీ కేసుల డిటెక్షన్ సర్వే వివరాలు, పీహెచ్‌సీలోని రిజిస్టర్, రికార్డులు, మందులు పరిశీలించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. మండలంలో 21,900 మంది జనాభాకు గాను 11 వేల మందికి టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. మండలంలో జనవరి 3లోగా సర్వే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గుండ్లసాగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న ఇమ్యునైజేషన్ ఔట్ రీచ్ సెషన్‌ను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశాలు, అంగన్‌వాడీ టీచర్లు పిల్లలందరికీ పోషకాహారం అందించడంలో టీకాలు ఇప్పించడంలో గర్భిణుల సంరక్షణలో కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ మెడికల్ ఆఫీసర్ నవీన్‌కుమార్, హెల్త్ సూపర్‌వైజర్ కుమారస్వామి, ప్రభావతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం
కాజీపేట: రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో జిల్లా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేయాలని కార్పొరేటర్ విజయశ్రీ రజాలీ అన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్‌లో శనివారం తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైల్వే పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సహకరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈమేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారయణ మాట్లాడుతూ.. భవిష్యత్ పోరాటంలో యువతను భాగస్వాములను చేయాలన్నారు. జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ.. ఒక మంచి లక్ష్యంతో సాగుతున్న ఉద్యమానికి అందరూ మనస్ఫూర్తిగా సహకరించడానికి మరింతగా ముందుకు రావాలని కోరారు. జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు అధ్యక్షతన నిర్వహించిన ఈసమావేశంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, మాజీ కార్పొరేటర్ ఎండీ అబూబక్కర్, నార్లగిరి రమేశ్, కాటపురం రాజు, బి.రంజిత్‌కుమార్, సందెల విజయ్, పి.శివకుమార సుంచు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
లెప్రసీ కేస్ డిటెక్షన్ సర్వే పూర్తి చేయండి


