నియంత్రణలో నేరాలు!
● గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గుముఖం
● కమిషనరేట్ పోలీసుల పనితీరు సంతృప్తికరం
● 2026లో మరిన్ని నూతన విధానాలతో ముందుకు
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ వెల్లడి
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘2024తో పోలిస్తే పలు నేరాల సంఖ్య తగ్గింది. ఈ నివేదిక కేవలం గణాంక రికార్డు కాదు. శాంతిభద్రతల రక్షణకు భాగస్వామ్యంతో సాధించిన ఫలితాల సంకలనం’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నేరాలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. కమిషనరేట్ పరిధి వివిధ స్థాయిల పోలీసు అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరిన్ని విధానాలతో 2026లోనూ ‘వరంగల్ కమిషనరేట్ పోలీస్.. ది బెటర్ పోలీస్’గా నిలవాలని ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక –25 సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నివేదికలోని వివరాలు వెల్లడిస్తూ గతేడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల సంఖ్య పెరిగిందని గతేడాది 14,412 కేసులు నమోదు కాగా, 2025లో 14,456 కేసులు నమోదయ్యాయని వివరించారు. 2026లో సమన్వయంతో పనిచేస్తూ, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సీపీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, దార కవిత, ఏఎస్పీ చేతన్, అదనపు డీసీపీ రవి, ప్రభాకర్, శ్రీనివాస్‌లతో పాటు, ఏసీపీలు మూల జితెందర్ రెడ్డి, సదయ్య, పింగిళి ప్రశాంత్ రెడ్డి, జాన్ నర్సింహులు, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు.


