ప్రతిభను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు
● టీసీఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గురువారెడ్డి
● కేయూలో ఈస్ట్ జోన్ గోల్డ్‌కప్
క్రికెట్ టోర్నమెంట్ షురూ
కేయూ క్యాంపస్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఈస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌ను శనివారం కాకతీయ యూనివర్సిటీలోని క్రీడా మైదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.విజయచందర్‌రెడ్డి, రాష్ట్ర బాధ్యులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గ్రామీణ యువత కోసం తెలంగాణ గోల్డ్‌కప్ క్రికెట్–2025 (ఈస్ట్‌జోన్) క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 8 జిల్లాల హనుమకొండ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాలకు సంబంధించిన జట్లు ఈటోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. 20 ఓవర్ల మ్యాచ్‌గా లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్లపెల్లి జయపాల్, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ అలీముద్దీన్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ చిలువేరు రాజ్‌కుమార్, బాధ్యులు సామిఅక్మల్, దాసరి శ్రీనివాస్, విష్ణుదాస్, శశాంక్, మరింగంటి నవరాసన్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు మ్యాచ్‌లు ఇలా..
హనుమకొండ, ఖమ్మం జిల్లా క్రికెట్ జట్లు మధ్య తొలి మ్యాచ్ నిర్వహించారు. ఇందులో ఖమ్మం జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులకు ఆల్ఔట్ కాగా, తదుపరి బ్యాటింగ్ చేసిన హనుమకొండ జట్టు 102 పరుగులకు ఆల్ఔట్ అయ్యింది. ఖమ్మం జట్టు విజయం సాధించింది. అనంతరం మహబూబాబాద్, ములుగు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మహబూబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. జనవరి 1వ తేదీ వరకు ఈక్రికెట్ పోటీలు కొనసాగుతాయి.


