అమలుకు నోచుకోని ‘వాల్టా’
పరకాల : తెలంగాణను పచ్చదనంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం హరితహారం, వనమహోత్సవాల పేరుతో కోట్లాది నిధులు ఖర్చు చేస్తోంది. అయితే కొంతమంది వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ వారి ఇష్టానుసారంగా చెట్లను నరికి వేస్తున్నారు. పరకాల డివిజన్ కేంద్రంగా కలప వ్యాపారం జోరుగా సాగుతున్న అటవీశాఖ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహారించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు ముడుపులు తీసుకుంటూ ఇష్టారీతిగా అనుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరకాల మున్సిపల్ పరిధిలోని కొందరు సామిల్లులతో పాటు మరికొందరు కలప వ్యాపారం చేసే వారు ఇదే పనిగా చెట్లు ఎక్కడ కనపడినా అనుమతి లేకుండానే నరికేస్తున్నారు. వాల్టా చట్ట ప్రకారం.. ఏదైనా చెట్టు నరికివేయాలంటే బలమైన కారణంతో పాటు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సొంతింట్లో చెట్టు కొట్టాలన్న అటవీ శాఖ నిబంధనలు పాటించాల్సిందే. అటవీశాఖ నిర్లక్ష్యమో.. కలప వ్యాపారుల దౌర్జన్యమో తెలియదు కానీ ప్రభుత్వ భూముల్లో, ప్రధాన రోడ్ల వెంట చెట్లు కనిపిస్తే చాలు కొందరు కర్ర కోత మిషన్‌లతో ట్రాక్టర్లపై రావడం చెట్లు నరికివేయడం పరిపాటిగా మారింది. పరకాల పట్టణంలోనే కాకుండా గ్రామాల నుంచి ప్రతి రోజు టన్నుల కొద్ది కలప ట్రాక్టర్లలో పరకాలలోని అనేక సామిల్స్‌కు చేరుకుంటుంది. అయితే అటవీశాఖ అధికారులు సామిల్లుల్లో టేకుపై ఆరా తీయడం తప్ప స్థానికంగా అక్రమంగా నరికివేస్తున్న చెట్లపై చర్యలు తీసుకోకపోవడంపై వన ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన మహోత్సవాలకు హడావుడి చేసే అధికారులు.. ముఖ్యంగా అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చెట్లు నరికితే చర్యలు
మొక్కలు, చెట్ల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత. తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్లలోని చెట్లను తొలగించాలన్న అటవీశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, నిబంధనలను అతిక్రమించి మున్సిపల్ పరిధిలో ఎవరైనా చెట్లు నరికివేస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి చర్యలు తీసుకుంటాం. – సోమిడి అంజయ్య,
మున్సిపల్ కమిషనర్, పరకాల
కోతకు గురవుతున్న భారీ వృక్షాలు
నీరుగారుతున్న ‘హరిత’ లక్ష్యం
పట్టించుకోని అటవీశాఖ అధికారులు
అమలుకు నోచుకోని ‘వాల్టా’


