మెరుగైన వైద్య సేవలందించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
కాజీపేట అర్బన్/కాజీపేటరూరల్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. న్యూశాయంపేట పీహెచ్‌సీలో వైద్య సేవల కోసం వచ్చిన వృద్ధురాలిని కలెక్టర్ మంగళవారం పలకరించారు. ఆరోగ్య మహిళా క్లినిక్ సేవలను పరిశీలించి మాట్లాడారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని, జనాభాకనుగుణంగా పరీక్షలు చేయాలని వైద్యులకు సూచించారు. పీహెచ్‌సీలోని ఓపీ నమోదు, ఫార్మసీ, ఆరోగ్యమహిళా రికార్డులు, ల్యాబ్ పరిశీలించారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య, కాజీపేట తహసీల్దార్ భావ్‌సింగ్, పీహెచ్‌సీ వైద్యులు మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యనందించాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. అయోధ్యపురంలోని ప్రభుత్వ పాఠశాల, దర్గా కాజీపేట జాగీరు ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించారు. విద్యార్థుల హాజరు పట్టిక, వంట గదిని పరిశీలించారు. అడ్మిషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ మన్మోహన్, ఎంఈఓ మనోజ్‌కుమార్, తహసీల్దార్ భావ్‌సింగ్ పాల్గొన్నారు.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయండి
హన్మకొండ అర్బన్: సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి నోడల్ అధికారులు, ఎంపీడీఓలతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను నిరోధించేందుకు నిఘా బంృదాలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీల హోర్డింగులు, పోస్టర్లు, ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఉన్న రాతలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, లెక్కింపుల వరకు అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆర్డీఓలు, నోడల్ అధికారులు, డీఎల్పీఓలు తదితరులు పాల్గొన్నారు.


