సీఎంఆర్ రాక.. పనులు లేక
కాజీపేట: కాజీపేటలోని ఎఫ్‌సీఐ గిడ్డంగులకు సీఎంఆర్ ధా న్యం రాక.. పనులు లేక కార్మికులు అవస్థలు పడుతున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు కాజీపేట పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా పదుల సంఖ్యలో ధాన్యం లారీలు నిలిచి ఉండేవి. కానీ, ఈ ఏడాది ఇంకా సీఎంఆర్ రాకపోవడంతో బియ్యం గింజ కూడా కాజీపేట గోడౌన్లకు రావడం లేదు. ఎఫ్‌సీఐలో సుమారు 200 మంది సిబ్బంది ఉన్నారు. పనిలేకపోతే రోజూవారి విధానంలో జీతా లు చెల్లించడం హమాలీలకు నష్టమే కలిగిస్తుంది. గతంలో బస్తాలను ఎత్తడం ద్వారా వీరికి అదనంగా డబ్బు వచ్చేది. గత సంవత్సరం ఇదే సమయంలో తమకు పని కల్పించాలని హమాలీ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆందోళన చేసి సత్ఫలితాలను సాధించారు. కానీ, ఈ ఏడాది పనులు లేక హమాలీలు అవస్థలు పడుతున్నారు. జీతభత్యాలు తగ్గడంతో సిబిల్ స్కోర్ తగ్గుతుందని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులు స్పందించి తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలని హమాలీలు కోరుతున్నారు.


