రిటైర్డ్ ఉద్యోగుల ఔదార్యం
కాజీపేట అర్బన్: వృద్ధాప్య దశలో మేమున్నాం మీకు అంటూ రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు ఔదార్యం చాటుకుంటున్నారు. ఉద్యోగ విరమణ పొందాం.. మన పని అయిపోయింది అనుకోకుండా రైల్వే మనకు ఎంతో ఇచ్చింది, తిరిగి కొంతయినా ఇచ్చేద్దాం.. మన స్నేహితులకు సేవలందిద్దాం అంటూ వృద్ధ పెన్షనర్లు ఇంటింటికీ తిరుగుతూ ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికెట్ సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెన్షన్ తీసుకుంటు న్న రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు ప్రతి సంవత్సరం నవంబర్‌లో తాము జీవించి ఉన్నట్లు లైఫ్ సర్టిఫికెట్ అందించాలి. ఇందుకు ఆన్‌లైన్‌లో జీవన్ ప్రమాణ్ యాప్‌లో నమోదు చేసుకోవాలి లేదా నేరుగా బ్యాంకుకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్‌ను అందించాలి. లేనిపక్షంలో పెన్షన్ నిలిపివేస్తారు. కాజీపేట పరిధిలో సుమారు 1,700 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 100 మందికి పైగా ఇంటి నుంచి కదిలే పరిస్థితి లేదు. దీంతో పెన్షనర్స్ అసోసియేషన్ బాధ్యులు కట్టస్వామి, సూర్యనారాయణ పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి హోం టు బ్యాంకు పేరిట జీవన్ ప్రమాణ్ సేవలందిస్తూ పెన్షన్ ఆగిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.


