
నీలినీడ లు
గీసుకొండలో బోనాలతో తరలివెళ్తున్న మహిళలు
సంగెంలో పోచమ్మ గుడి వద్ద మొక్కులు సమర్పిస్తున్న భక్తులు
మత్స్యసంఘాలకు సరఫరా చేసే చేపపిల్లలను పరిశీలిస్తున్న జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి, తదితరులు (ఫైల్)
● చేపపిల్లల పంపిణీ ఉన్నట్టా..లేనట్టా?
● గతేడాది లక్ష్యానికి సగం మేరకే పంపిణీ
● ఈ ఏడాది కనీసం టెండర్ల ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం
● ఆలస్యం కావడం, నాసిరకం చేపపిల్లల పంపిణీతో మత్స్యకారులకు నష్టం
● నగదు బదిలీ చేస్తే మేలంటున్న
మత్స్యసంఘాలు
గీసుకొండ: జిల్లాలో మత్స్యకారులకు ఉచిత చేపపిల్లల పంపిణీపై నీలినీడలు అలుముకున్నాయి. వంద శాతం సబ్సిడీపై 2016లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపపిల్లల ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్టినా సకాలంలో ఏ ఒక్క ఏడాది కూడా చెరువులకు చేపపిల్లలు చేరిన దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చేపపిల్లల సరఫరాకు టెండర్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు నెల నడుస్తున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీపై ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో అసలు చేపపిల్లల పంపిణీ ఉన్నట్టా..లేనట్టా అనే సందేహాలు మత్య్సకారుల సంఘాల్లో తలెత్తుతున్నాయి. సకాలంలో చేపపిల్లలను చెరువుల్లో వదలనట్‌లైతే వాటి ఎదుగుదల సరిగా ఉండక తాము నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు టెండర్లకు సంబంధించి ప్రభుత్వం, మత్స్యశాఖ ఊసెత్తకపోవడంతో అసలు పథకాన్ని కొనసాగిస్తారా..? లేదా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాదైనా ముందస్తుగా టెండర్లు పిలుస్తారని అనుకుంటే ఇప్పటివరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.
ఎలాంటి కసరత్తు లేదు..
ప్రతీ ఏడాది వేసవి కాలం ముగిసే నాటికే ప్రభుత్వం చేపపిల్లలకు సంబంధించిన టెండర్లు పిలిచేది. గతేడాది ఊరించి..ఊరించి ఆలస్యంగా లక్ష్యానికి కోతపెట్టి సగం మేరకే చేపపిల్లలను పంపిణీ చేశారు. ఆలస్యం కావడంతో ఆ చేపపిల్లలు ఎదుగుదల లేక మత్స్యకారులు ఇబ్బందులు పడ్డారు. సమయానికి వదలకపోవడం వల్ల చేపల్లో ఎదుగుదల లేకపోవడంతో తమకు గిట్టుబాటు ధర రావడం లేదని అంటున్నారు. కిలో నుంచి రెండు మూడు కిలోల వరకు చేపలు ఎదగాలంటే పిల్లలను సకాలంలో చెరువుల్లో వదలాల్సి ఉంటుందని, అప్పుడే నాలుగు నెలల్లో వాటి వృద్ధి జరిగి చేతికొస్తాయని అంటున్నారు. అలాంటి చేపలకే మార్కెట్‌లో మంచి ధర వస్తుందని, వాటిని ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. టెండర్ల విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారి(డీఎఫ్‌ఓ)నాగమణిని ‘సాక్షి’ వివరణ కోరగా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు.
ఆగస్టు లోపు వదిలితేనే..
ఆగస్టులోపు చేపపిల్లలను చెరువుల్లో వదిలితే మంచిదని మత్స్యశాఖ అధికారులే చెబుతున్నారు. కానీ ఈ ప్రక్రియ ప్రతి ఏడాది ఆలస్యంగానే జరుగుతోంది. లోపాలను అధిగమించి ముందస్తుగా నిధులను సమకూర్చుకోవడంలో మత్య్సశాఖ విఫలం అవుతోందని విమర్శలు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో జిల్లాలోని చెరువుల్లో లక్ష్యం మేరకు కాకుండా అందులో సగమే చేపపిల్లలను మత్స్య సంఘాల వారికి పంపిణీ చేశారు. జిల్లాలో సుమారు 1.93 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉండగా అందులో సగమే, అది కూడా చాలా ఆలస్యంగా పంపిణీ జరిగిందని మత్య్ససంఘాల వారు అంటున్నారు. గతేడాది రెండు ఏజెన్సీలు టెండర్లను దక్కించుకుని చేపపిల్లలను అందించాయి. అయితే చేపపిల్లలు చాలా చిన్న సైజులో నాసిరకంగా ఉండటం, అదను దాటిన తర్వాత ఆలస్యంగా చెరువుల్లో పోయడంతో పెద్దగా ఎదగలేదని మత్స్యసంఘాల వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు నష్టం తప్ప లాభం రాదని చెబుతున్నారు.
సొంతంగా కొనుగోలుకు మొగ్గు
చేపపిల్లల పంపిణీ ప్రతీ ఏడాది ఆలస్యం అవుతుండటంతో పలు మత్స్యసంఘాల వారు నీరు చేరిన జలాశయాల్లో సొంత ఖర్చుతో చేపపిల్లలను కొనుగోలు చేసి వదులుతున్నారు. ఆంధ్రా ప్రాంతం నుంచి పెద్ద సైజు (ఫింగర్ లింగ్స్) చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో వదలడానికి సిద్ధం అవుతున్నారు.
నగదు బదిలీ చేస్తే మేలు..
జిల్లాలో చాలా మత్స్యసంఘాలు ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై అందించే చేపపిల్లలు నాసిరకంగా ఉంటున్నాయనే అభిప్రాయంతో ఉన్నాయి. టెండర్లు దక్కించుకున్న వారు చేపపిల్లలను సరైన సంఖ్య మేరకు చెరువుల్లో వదటడం లేదని, ఆంధ్రా ప్రాంతం నుంచి నాసిరకం పిల్లలను తెచ్చి పంపిణీ చేస్తుండటంతో ఎదుగుదల సరిగా లేక నష్టపోతున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో నగదు బదిలీ చేస్తే తామే మేలైన రకం చేపపిల్లలను కొనుగోలు చేసి సకాలంలో చెరువుల్లో వదిలే అవకాశం ఉంటుందని, ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించాలని అంటున్నారు.
జిల్లాలో మొత్తం చెరువులు
702
మత్స్య సంఘాల్లోని
సభ్యులు
15,741 మంది
మత్స్య సంఘాలు
184
మొత్తం చెరువుల నీటి విస్తీర్ణం12,910 హెక్టార్లు