
బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి
నర్సంపేట: తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంటులో పెట్టి ఆమోదం తెలపాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈమేరకు పట్టణంలో ఆదివారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అట్టడుగు వర్గాలైన బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకుండా అణచివేస్తూ దోచుకుంటున్నారని, అందుకు బీజేపీ పాలకులు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారని ఆరో పించారు. మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. జనాభాలో ఆరు శాతంలేని అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించి 50శాతం పైగా ఉన్న బీసీలకు కనీసం 62శాతం రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురావడానికి అనేక అడ్డంకులు కల్పిస్తూ బీసీలకు తీరని అన్యా యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగి 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను అసెంబ్లీలో తీర్మానించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులతో ఆమోదించకుండా కాలయాపన చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, కలకోట అనిల్, వజ్జంతి విజయ, ఉదయగిరి నాగమణి, యాకలక్ష్మి, లక్ష్మి, లింగయ్య, వీరన్న, వెంకన్న, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేటలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన