
నానో నయం!
నానో యూరియా, నానో డీఏపీ
● ద్రవరూపంలో నానో యూరియా, డీఏపీ..
● గుళిక ఎరువుల కంటే పంటలకు
ఎంతో మేలు
● తగ్గనున్న ఖర్చు, పెరగనున్న దిగుబడి
● రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
సంగెం: కేంద్రప్రభుత్వం గుళికల రూపంలో ఉన్న యూరియా, డీఏపీలకు బదులుగా ద్రవరూపంలో నానో ఎరువులు తయారు చేస్తున్నది. దీంతో రైతులకు ధర తక్కువ కావడమే కాదు రవాణా ఖర్చులు, తిప్పలు తప్పుతున్నాయి. అర లీటరు నానో యూరియా, డీఏపీ బాటిల్, ఒక్క యూరియా, డీఏపీ బస్తాతో సమానంగా పంటపై ప్రభావం చూపుతుందని మండల వ్యవసాయాధికారి సాగరిక చెబుతున్నారు. నానో ఎరువుల ఉపయోగం గురించి రైతులకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో పాటుగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రైతులు ఇప్పుడిప్పుడే నానో ఎరువులు వాడడానికి ముందుకు వస్తున్నారు.
ధర తక్కువ..
అర లీటరు నానో యూరియా బాటిల్ గుళికల రూపంలో ఉన్న 45 కేజీల బస్తాతో సమానం. అదేవిధంగా అరలీటరు నానో డీఏపీ బాటిల్ 50 కేజీల బస్తాతో సమానం. ధర విషయానికోస్తే యూరియా బస్తా రూ. 267 కాగా నానో బాటిల్ కేవలం రూ 225 మాత్రమే. డీఏపీ బస్తా రూ.1,350లు కాగా నానో డీఏపీ రూ. 600 మాత్రమే.
బహుళ ప్రయోజనాలు..
గుళికల రూపంలో ఉన్న యూరియా బస్తాను ఎకరం పొలంలో వాడడం వల్ల 60 శాతం మాత్రమే మొక్క గ్రహించగలుగుతుంది. మిగతా 40శాతం గాలిలో కలిసి వాయుకాలుష్యం ఏర్పడుతుంది. డీఏపీ బస్తాను దుక్కిలో వేయాల్సి ఉంటుంది. కాని కొందరు రైతులు పైపాటుగా వేయడంతో మొక్కలకు ఎలాంటి ఫలితం దక్కడం లేదు. ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా, నానో డీఏపీలను నేరుగా గాని ఒక లీటరు నీటికి 4 ఎంఎల్ చొప్పున ఏదైనా పురుగుల మందులతో కలిపి పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలపై పిచికారీ చేసుకుంటే నేరుగా ఆకుల ద్వారా మొక్క వందశాతం గ్రహిస్తుంది. ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ ద్వారా వేర్లలో కణజాల వృద్ధికి ఉపయోగపడుతుంది. వర్షాభావ పరిస్థితులు, అధిక వర్షపాతంలోనూ నానో యూరియా, డీఏపీలను పంటలపై పిచికారి చేసుకోవచ్చు. పంట వేసిన 20–25 రోజుల్లో ఒకసారి, 40–45 రోజుల్లో మరోసారి పిచికారి చేసుకుంటే పంటల ఎదుగుదల బాగుంటుంది. రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను దుక్కిలో వేసుకుని కలియదున్ని పంటలు సాగు చేసిన తర్వాత నానో ఎరువులను పంటలపై పిచికారీ చేస్తే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..
గుళికల రూపంలో ఉన్న రసాయనిక ఎరువుల కంటే నానో ఎరువులు మేలు. పంటలకు పైపాటుగా నానో డీఏపీ అర లీటరు, నానో యూరియా అరలీటరులను ఎకరాకు రెండు దఫాలుగా పిచికారీ చేసుకుంటే అధిక దిగుబడులు వస్తాయి.
–సాగరిక, ఏఓ సంగెం

నానో నయం!

నానో నయం!