
దేవాదుల వద్ద డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి, సీతక్క తదితరులు
రోజుకు 11 టీఎంసీలు తరలిస్తే శ్రీశైలం 25 రోజుల్లోనే ఖాళీ
నీటివాటాలు తేలాకనే బనకచర్లపై ముందుకెళ్లాలి..
మా ప్రభుత్వానికి దేవాదుల అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్
వైరా నదిపై జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
సాక్షి ప్రతినిధి వరంగల్/ఏటూరునాగారం/మధిర: శ్రీశైలం ఎగువ భాగాన రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే నిలిపేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు సమీపంలో వైరా నదిపై రూ.600 కోట్లతో నిర్మించనున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి భట్టి ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా రోజుకు ఒక టీఎంసీ విడుదల చేస్తేనే లక్షల ఎకరాల భూమి సాగవుతోందని, పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 11 టీఎంసీలు తరలిస్తే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు సైతం 25 రోజుల్లోనే ఖాళీ అవుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వల్లనే ఏపీలో బనకచర్ల, శ్రీశైలం లిఫ్ట్ ఆగిపోయాయని వెల్లడించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ వల్లే నష్టం..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ సర్కారు కలిసి దొంగచాటుగా ఆర్డినెన్స్ తెచ్చి భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఏపీలో కలిపి, గిరిజనులకు చెందిన 2 లక్షల ఎకరాలు పోలవరానికి ధారాదత్తం చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. గిరిజనులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా పోలవరం ఎత్తు తగ్గించి రెండు లక్షల ఎకరాలను కాపాడాలని ఏపీ సీఎంను డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయ్యాక నికర జలాలు, వరద జలాల వాటా తేలాకనే బనకచర్ల ప్రస్థావన తీసుకురావాలని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధిర నియోజకవర్గంలోని 30 గ్రామాలను నాగార్జునసాగర్ రెండో జోన్‌లోకి మార్చి, రూ.600 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇచ్చిందని తెలిపారు.
అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు దేవాదుల
రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టు దేవాదుల అని భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ములుగు జిల్లా దేవాదుల చొక్యారావు ఎత్తిపోతల పథకం, సమ్మక్క–సాగర్ బరాజ్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి వారు ఆదివారం పరిశీలించారు. ముందుగా 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం దేవాదుల పంపుహౌస్ వద్ద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి, ఉత్తమ్ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 28 వేల ఎకరాల భూ సేకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూ నిర్వాసితులకు చెల్లించేందుకు రూ.67 కోట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
మరింత భూ సేకరణ కోసం రూ.179 కోట్ల వరకు అవసరమని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌ను కూల్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతేనని ఆరోపించారు. ఇచ్చంపల్లి తుమ్మిడిహెట్టి బరాజ్‌ను రూ.38 వేల కోట్లతో కట్టి తీరుతామని భట్టి, ఉత్తమ్ స్పష్టం చేశారు. కాగా, దేవాదుల నుంచి వేరే ప్రాంతాలకు నీళ్లు తీసుకపోతున్నారని, తన నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని మంత్రి సీతక్క కోరారు.
రామప్ప– లక్నవరంను అనుసంధానిస్తూ కెనాల్ నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, నాగరాజు, మురళీనాయక్, ఇరిగేషన్ కమిషనర్ ప్రశాంత్ పాటిల్ పాల్గొన్నారు.