దేవాదుల పనుల్లో నిర్లక్ష్యం వీడాలి | - | Sakshi
Sakshi News home page

దేవాదుల పనుల్లో నిర్లక్ష్యం వీడాలి

Aug 11 2025 6:20 AM | Updated on Aug 11 2025 6:20 AM

దేవాదుల పనుల్లో నిర్లక్ష్యం వీడాలి

దేవాదుల పనుల్లో నిర్లక్ష్యం వీడాలి

ఏటూరునాగారం/కన్నాయిగూడెం: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని, దేవాదుల పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని, పనులు పెండింగ్‌లో ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్‌ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్‌ను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. తుపాకులగూడేనికి హెలికాప్టర్‌లో చేరుకున్న మంత్రులకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు. ఆ తర్వాత సమ్మక్క బ్యారేజీ వద్ద 59 గేట్లను పరిశీలించారు. నీటి నిల్వలు ఏ మేరకు ఉన్నాయని, గేట్లు ఎన్ని ఎత్తి, ఎన్ని మూశారని తెలుసుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో దేవాదుల పంపుహౌస్‌ వద్ద ఉన్న గోదావరి నీటి నిల్వలను పరిశీలించి మోటార్ల ఎన్ని నడుస్తున్నాయని, ఎంత నీరు ఎత్తిపోశారని ఆరా తీశారు. ఇరిగేషన్‌ ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావు ప్రొజెక్టర్‌ ద్వారా మంత్రులకు దేవాదుల స్థితిగతులను వివరించారు. అనంతరం సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్‌ పెట్టిందని, ఈ హైలీ ప్రాజెక్టును టీడీపీ, బీఆర్‌ఎస్‌ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అప్పుడు చేపట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే, ఇప్పుడు పూర్తి చేసేది కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్‌కు రూ.23వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తే రూ.16 వేల కోట్లు వడ్డీలు కట్టేందుకే సరిపోతుందన్నారు. కావేరి, గోదావరికి అనుసంధానంగా 200 టీఎంసీల కెపాటీగల ఇచ్చంపల్లి, తుమ్మడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతామన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని మంత్రులతో మాట్లాడి ఎన్‌ఓసీ కూడా తీసుకుంటామన్నారు.

6 లక్షల ఎకరాలకు సాగు నీరు :

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క,

ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ 17 నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని లక్ష్యంగాపెట్టుకొని దేవాదుల ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. ఇప్పుడు దీని అంచనాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 16.38 టీఎంసీల నుంచి 17.38 టీఎంసీలకు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రూ.16 కోట్లు దేవాదుల భూ నిర్వాసితులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లిస్తామన్నారు. 72 మీటర్ల నీటిని నిల్వ చేసుకొని మోటార్ల ద్వారా ఎత్తిపోసి రిజర్వాయర్ల నుంచి కెనాల్‌ ద్వారా సాగు నీరు అందిస్తామని తెలిపారు.

ములుగు జిల్లాకు న్యాయం చేయాలి :

మంత్రి సీతక్క

ములుగు జిల్లాలో వంద కిలోమీటర్ల గోదావరి నీటి ప్రవాహం ఉందని మంత్రి సీతక్క అన్నారు. సమైక్య రాష్ట్రంలో ములుగుకు అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రంలో న్యాయం చేయాలని ఆమె కోరారు. రామచంద్రపురం గ్రావిటీ కెనాల్‌ ద్వారా పాకాల, కొత్తగూడెం నీటి సరఫరా చేయాలి. పొట్లాపురం కెనాల్‌ కోసం సంబంధిత ఫైల్‌ను ప్రభుత్వం వద్ద ఉందని, దానిని పరిశీలించి బడ్జెట్‌ ఇవ్వాలని, గౌరారం, మల్లూరు, రామప్ప, లక్నవరం ప్రాంతాల్లోకి రైతులకు నీరు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేసి పంటలకు నీళ్లివ్వాలని కోరారు. సమీక్షలో ఇరిగేషన్‌ కమిషనర్‌ ప్రశాంత్‌పాటిల్‌, ఇరిగేషన్‌ ఈఈ జగదీశ్‌, ములుగు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, కాంగ్రెస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, అప్సర్‌పాషా పాల్గొన్నారు.

కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి

అధికారుల పనితీరులో మార్పు రావాలి

భారీ నీటి పారుదలశాఖ

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సమ్మక్క సాగర్‌ బ్యారేజీ,

దేవాదుల వద్ద పంపుహౌస్‌ పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement