
‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ బలోపేతం
పరకాల: మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళల ఉచిత ప్రయాణాలతో ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతమవుతోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. పరకాల ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం నాలుగు కొత్త ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్వయంగా బస్టాండ్ నుంచి డిపో వరకు బస్సు నడిపించారు. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అమలుచేస్తున్న మహాలక్ష్మీ పథకం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఇదే స్ఫూర్తితో ఇతర రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుచేయడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోందన్నారు. త్వరలో పరకాల ఆర్టీసీ డిపోకు మరిన్ని కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, శ్రీకుంకుమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్‌రావు, ఆర్టీసీ డీఎం రవిచంద్ర, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు కట్కూరి దేవేందర్‌రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్, నాయకులు సోదా రామకృష్ణ, యార మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
నాలుగు కొత్త ఆర్టీసీ బస్సుల ప్రారంభం..
స్వయంగా బస్సు నడిపి ఆకట్టుకున్న ఎమ్మెల్యే